- సొంతింట్లో బంగారం, వెండి చోరీ
- ఏమీ తెలియనట్లు భార్యతో వెళ్లి ఫిర్యాదు
- ఇంటి సమీపంలోని కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
- నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘటన
నిర్మల్, వెలుగు : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెత తలకిందులైంది. ఇంటి దొంగ గుట్టును పక్కింటి సీసీ కెమెరాలు రట్టు చేశాయి. ఇంట్లో చోరీ జరిగిందని భార్య ఫిర్యాదు చేయగా.. ఆ దొంగ ఆమె భర్తేనని తేలడంతో అంతా అవాక్కయ్యారు. పోలీసుల కథనం ప్రకారం...నిర్మల్పట్టణంలోని మహాదేవపూర్ కాలనీలో అనితా రాణి, సావ్లే శివ దంపతులు ఉంటున్నారు.
అనిత రాణి సోఫీ నగర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఎప్పట్లాగే ఈనెల 19న భార్యను స్కూల్లో దింపిన శివ సాంబ్లే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, అప్పటికే ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉంది. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉండి, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకొని ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా చోరీ జరిగిన ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యపోయారు.
అందులో ఉన్న విజువల్స్ ప్రకారం అనిత భర్త సావ్లే శివ దొంగతనం చేసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శివను తీసుకువెళ్లి విచారించగా తానే చోరీ చేసినట్లు అంగీకరించాడు. 19న భార్యను స్కూల్లో దింపి ఇంటికి వచ్చి తాళం పగులగొట్టి నగలు ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.3.20 లక్షల విలువైన 8 తులాల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలించినట్టు నిర్మల్ టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.