జాబ్ క్యాలెండర్​లో క్లారిటీ లేదు

  • బీజేపీ ఎమ్మెల్యే పాయల్​ శంకర్​

 ఖైరతాబాద్, వెలుగు: జాబ్ క్యాలెండర్​లో క్లారిటీ లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ అన్నారు. అందులో ఉద్యోగుల సంఖ్య పెట్టలేదని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్​వద్ద ఆయన మాట్లాడారు. ఉద్యోగ నోటిఫికేషన్లను సీఎం రేవంత్  రెడ్డి ప్రకటిస్తారని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, కానీ.. నోటిఫికేషన్లు వేయడం లేదని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్  ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. తాము 8 మంది ఉన్నా మజ్లిస్  సభ్యుడి కన్నా తమకు తక్కువ సమయం ఇచ్చారన్నారు. 

ధరణిపై ఇంత తక్కువ చర్చా?: వెంకటరమణా రెడ్డి

ధరణి, హైదరాబాద్​ నగరంపై అసెంబ్లీలో చా లా తక్కువ చర్చ జరిగిందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ​తీసుకువచ్చిన ధరణి వల్ల రైతులకు ఎంత కష్టం వచ్చిందో ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే తప్ప కొత్తగా మాట్లాడింది ఏమీ లేదని మండిపడ్డారు. మజ్లిస్  సభ్యుడు అక్బరుద్దీన్​ ఒవైసీ మాట్లాడితే గంటల గంటలు  మైక్​ ఇచ్చారని, మిగతా వారికి మైక్​ కట్​ చేస్తున్నారని వాపోయారు. 

ధరణి వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం జరగాలని తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కామారెడ్డిలో 87 రోజులు ఆమరణ  దీక్ష చేశానని ఆయన గుర్తుచేశారు.- హడావిడిగా తేవడంతోనే ధరణి ఫెయిల్​ అయ్యిందన్నారు. ఇక, హైదరాబాద్ లో మెట్రోకు పొక్కలు పెట్టి హోర్డింగులు పెడుతున్నారని, మెట్రో పిల్లర్లు కూలిపోతే ఎవరు జవాబు అని ఆయన  ప్రశ్నించారు. సీఎం బంధువుకు కొత్త ఏజెన్సీని అప్పగించి, దాని వలన వచ్చే ఆదాయాన్ని దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు.