సంగారెడ్డిలో చెత్త సమస్యకు పరిష్కారమెప్పుడు?

  • సంగారెడ్డిలో ప్రతిరోజు 50 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ
  • డంపింగ్​యార్డ్​లేకపోవడంతో అనేక సమస్యలు
  • రూ.5 కోట్లు కేటాయించినా స్థల సేకరణపై నో క్లారిటీ 

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డిలో డంపింగ్ యార్డు లేక ప్రతిరోజు చెత్త సమస్య తలెత్తుతోంది. మున్సిపాలిటీ పరిధిలో రెండు లక్షల జనాభా ఉండగా, 38 వార్డులు, 30 వేలకు పైగా బిల్డింగులు ఉన్నాయి. రోజుకు 50 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. దీనిని డంప్ చేయడానికి  డంపింగ్ యార్డ్ లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.  మున్సిపాలిటీ సిబ్బంది సేకరించిన చెత్తను చుట్టుపక్కల గ్రామాల శివారులో డంప్​చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామస్తులు దుర్వాసన భరించలేక సీజనల్​వ్యాధులకు గురవుతున్నారు. 

38 వాహనాలు,10 ట్రాక్టర్లు..

సంగారెడ్డి మున్సిపాలిటీలో చెత్త సేకరణకు 38 వార్డులకు 38 వాహనాలు, చెత్తను మరోచోటికి డంప్ చేసేందుకు 10 ట్రాక్టర్లు ఉన్నాయి. వీటితోపాటు దూర ప్రాంతాలకు చెత్తను తరలించేందుకు భారీ వాహనాలను ఉపయోగిస్తున్నారు. డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల ఫసల్వాది, హనుమాన్ నగర్, ఇరిగిపల్లి, కంది, ఆరుట్ల, చేర్యాల గ్రామాల పరిధిలో చెత్తను డంప్​చేస్తున్నారు. మరికొన్నిసార్లు బొబ్బిలి కుంట, మహబూబ్ సాగర్ చెరువు కట్టపై డంప్ చేస్తున్నారు. ఇందులో మటన్, చికెన్ షాప్​ల నుంచి సేకరించిన వ్యర్ధ పదార్థాలు ఉండడంతో అవి కుళ్లిపోయి దుర్వాసన రావడంతో ఆయ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఒక్కోసారి ఇండ్లలో నుంచి సేకరించిన చెత్త ఎక్కడ వేయాలో అర్థం కాక మున్సిపల్ సిబ్బంది చెత్తను ట్రాక్టర్లలోనే ఉంచుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో అపరిశుభ్రతను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ లు కొనసాగుతుండగా మరోవైపు జిల్లా కేంద్రంలో నెలకొన్న చెత్త సమస్యపై దృష్టి పెట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మూలుగుతున్న రూ.5 కోట్లు

మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం గతంలో మంజూరు చేసిన రూ.5 కోట్లు బల్దియా అకౌంట్​లో మూలుగుతున్నాయి. 2017లో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. కంది మండలం చేర్యాల గ్రామ శివారులో ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్రహరీ నిర్మాణ పనులు చేస్తుండగా గ్రామస్తులు వ్యతిరేకించి పనులు అడ్డగించారు. ఆ తర్వాత కొండాపూర్ మండలం మల్కాపురం గ్రామ శివారులో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించినప్పటికీ అక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో డంపింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టకుండానే మరోచోట వెతికే పనిలో పడ్డారు. 

ALSO READ : చెన్నూర్​లో సోలార్ వెలుగులు

కొద్ది రోజులకు ఫసల్ వాది, దాసుగడ్డ తండా ప్రాంతాల్లో డంపింగ్  యార్డ్ స్థలాన్ని పరిశీలించగా అక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో డంపింగ్​యార్డ్ నిర్మించాలన్న విషయాన్ని అధికారులు మర్చిపోయారు. దీంతో ఎక్కడపడితే అక్కడ చెత్తను డంప్​చేస్తుండడంతో సమీప ప్రాంతాల్లో దోమలు, పందులు స్వైర విహారం చేస్తూ ప్రజలకు రోగాలు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి సంగారెడ్డిలో లేదా సమీప ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.