ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్లు కంప్లయింట్

  • కొమురం భీం జిల్లాలోని కోసినిలో ఘటన 
  • డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు కంప్లయింట్

కాగజ్ నగర్, వెలుగు : కుమురం భీం ఆసిఫాబాద్‌‌ జిల్లా కాగజ్‌‌నగర్‌‌ మండలం కోసినిలోని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. గురువారం ఉదయం బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటికి వెళ్లడంతో చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.

గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి వెళ్లి బీరువాలోని డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్టు బీఆర్ఎస్ నేతలు కాగజ్ నగర్ రూరల్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్లూస్ టీమ్స్, డాగ్ స్కాడ్స్ తో దర్యాప్తు చేపట్టారు. 

కాగజ్‌‌నగర్‌‌ డీఎస్పీ రామానుజం వెళ్లి పరిశీలించారు. కాగా తన ఇంట్లో చోరీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్(ట్విట్టర్) లో  స్పందించారు. కాగజ్‌‌నగర్‌‌లోని తన ఇంట్లో జరిగిన చోరీపై పూర్తి విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీలను కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ టీ బరిలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన సమయంలో ఆర్ఎస్పీ కాగజ్ నగర్ కు ఆనుకుని కోసినిలో ఇంటిని నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఎప్పుడు కాగజ్ నగర్ కు వెళ్లినా ఆర్ఎస్పీ ఇక్కడే ఉంటుంటారు.