జైనథ్, వెలుగు : ఆ బడిలో అరుపులు..కేకలు వినిపిస్తున్నాయని హడలిపోయిన విద్యార్థులు బడికి రావడానికి భయపడుతున్నారు. అలాంటిదేమీ లేదని చెప్పిన టీచర్..రాత్రి పూట ఆ స్కూల్లో ఒంటరిగా నిద్రపోతే స్కూల్‌కు భయపడకుండా వస్తారా అని సవాల్ చేశాడు. వారు ఒప్పుకోవడంతో నిద్రపోయి పిల్లల్లో ధైర్యం నింపారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగింది.
ఆనంద్ పూర్ ప్రైమరీ స్కూల్ఆవరణలోని వృక్షం ఇటీవల నేలమట్టమైంది. దీంతోపాటు అప్పుడప్పుడు అరుపులు వినిపిస్తున్నాయని ప్రచారం మొదలైంది. దీంతో పిల్లలు స్కూల్‌కు రావడానికి భయపడ్డారు. ఓ విద్యార్థి ఏకంగా స్కూల్ మారాడు. ఈ క్రమంలో స్కూల్‌కు కొత్తగా వచ్చిన టీచర్ రవీందర్ విద్యార్థుల భయాన్ని పోగొట్టేందుకు మంగళవారం రాత్రి స్కూల్లో
నిద్రపోయారు. తెల్లారిన తర్వాత ఏమైందోనని వచ్చిన విద్యార్థులకు రవీందర్ సార్ నిక్షేపంగా కనిపించేసరికి దయ్యం లేదని నమ్మారు. ఈ విషయం సోషల్మీడియాలో వైరల్ కావడంతో రవీందర్ సార్ను అందరూ అభినందిస్తున్నారు.