- వేధిస్తున్నారని ఆరోపణ
- మూకుమ్మడిగా సెలవు
కడెం, వెలుగు : నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ సుజాత రెడ్డి తమను వేధిస్తున్నారని సిబ్బంది ఆరోపించారు. కార్యాలయ 13 మంది రెవెన్యూ సిబ్బందిమూకుమ్మడిగా మూడు రోజులు సెలవు పెట్టారు. సెలవు పత్రాన్ని తహసీల్దార్‌కు అందించినట్లు మీడియాకు తెలిపారు. కడెం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సుజాత రెడ్డి సిబ్బందిపై అనుచితంగా వ్యవహరిస్తున్నారని డిప్యూటీ తహసీల్దార్ శంకర్‌తో సహా 13 మంది రెవెన్యూ సిబ్బంది ఆరోపించారు.
తహసీల్దార్ వేధింపులు భరించలేక నిరసన వ్యక్తం చేస్తూ సెలవు పెట్టి నట్లు ఇద్దరు ఆర్ఐలు తక్కన్న, లక్ష్మణ్, సీనియర్ అసిస్టెంట్ నాగోరావు, జూనియర్ అసిస్టెంట్లు కవిత, ప్రిస్కిళ్ల, లావణ్య, మండల సర్వేయర్ ఉమాజీ, సిబ్బంది మీడియాకు వివరించారు.
విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించినందుకే: తహసీల్దార్
దీనిపై తహసీల్దార్ సుజాత రెడ్డిని వివరణ కోరగా.. తనకు ఎలాంటి సెలవు పత్రం అందలేదని వెల్లడించారు. సక్రమంగా విధులు నిర్వహించాలని వారికి సూచించినందుకే అంతా ఏకమై తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. పబ్లిక్కు సర్వీస్ చేయమంటే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నిందలు వేస్తున్నారని, ఇలా చేయడం సరికాదన్నారు.