స్పోర్ట్స్​కిట్ల జాడేది..!

  •    రూ. కోట్ల విలువ చేసే క్రీడా సామగ్రి ఎటుపోయినట్లు?
  •     కొన్నిచోట్ల పూర్తికాని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు
  •     మరి కొన్నిచోట్ల గడ్డి, ముళ్ల పొదలతో అధ్వానం
  •     ఇబ్బంది పడుతున్న యువకులు, క్రీడాకారులు

మెదక్, వెలుగు : గత ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి సరఫరా చేసిన స్పోర్ట్స్​కిట్లు ఎటుపోయాయో.. ఏమయ్యాయో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డుల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు (టీకేపీ)లు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 18 వేల టీకేపీలు ఏర్పాటు చేసినట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. మెదక్ జిల్లాలో 469, సిద్దిపేట జిల్లాలో 525, సంగారెడ్డి జిల్లాలో 733 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు.

అప్పట్లో ప్రభుత్వం జారీ చేసిన గైడ్​ లైన్స్​ప్రకారం స్థలం అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ఎకరం, అరెకరం విస్తీర్ణంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్​ కోర్టులు ఏర్పాటు చేయడంతోపాటు, ఎక్సర్​సైజ్​లు చేసేందుకు వీలుగా ఇనుప రాడ్లతో బార్​లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా మెజారిటీ చోట్ల ఎక్సర్​సైజ్​బార్​లు, వాలీబాల్​నెట్​కట్టేందుకు వీలుగా ఇనుప పైపులు పాతారు తప్ప దాదాపుగా ఎక్కడా కోర్టులు ఏర్పాటు చేయలేదు. క్రీడా ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్​మాదిరిగా పొడవుగా పెరిగే చెట్లు నాటాలని నిర్దేశించినా ఎక్కడా నాటిన దాఖలాలు లేవు.

కానీ మెజారిటీ చోట్ల తెలంగాణా క్రీడా ప్రాంగణం అనే బోర్డులు మాత్రం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల స్థలాలు దొరకలేదని చెప్పి గవర్నమెంట్​స్కూల్​గ్రౌండ్​లలోనే క్రీడా ప్రాంగణాల బోర్డులు ఏర్పాటు చేశారు. పనులు అసంపూర్తిగా ఉండడంతో గ్రామాల్లో, మున్సిపల్​ వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా ఉన్నాయి.  పనులు పూర్తికాక వినియోగంలోకి రాకపోవడం, మెయింటనెన్స్​లేకపోవడంతో అనేక చోట్ల క్రీడా ప్రాంగణాలు పిచ్చి గడ్డి, చెట్ల పొదలు మొలిచి అధ్వాన్నంగా మారాయి.  

ఆదరాబాదరా పంపిణీ..

స్పోర్ట్స్​కిట్లు మండల పరిషత్​ఆఫీస్​లకు రాగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారులు ఆదరాబాధరాగా వాటిని అప్పటి సర్పంచులకు అప్పగించారు. గ్రామ పంచాయతీ ఆఫీస్​లో ఉంచి క్రీడా ప్రాంగణాల్లో ఆడుకునే, సాధన చేసే క్రీడాకారులకు ఆ కిట్లోని క్రీడా సామగ్రిని ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ఎక్కడా ఆ కిట్ల జాడ కనిపించడం లేదు. మండల పరిషత్​ఆఫీస్​ల నుంచి ఆ కిట్లను తీసుకెళ్లిన అప్పటి అధికార పార్టీ ప్రజాప్రజాప్రతినిధులు తమకు గ్రామాల్లో అనుకూలంగా ఉన్న వారికి ఇచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో అధికారులెవరూ స్పోర్ట్స్​ కిట్ల గురించి పట్టించుకోలేదు.

మెజారిటీ చోట్ల క్రీడా ప్రాంగణాలు ఆటలాండేందుకు అనువుగా లేకపోగా, పూర్తియిన చోట కూడా ఎక్కడా ప్రభుత్వం సరఫరా చేసిన స్పోర్ట్స్​కిట్లతో క్రీడాకారులు, యువకులు, స్టూడెంట్స్​ఆటలు ఆడిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి స్పోర్ట్స్​కిట్ల జాడ కనుగొని, అసంపూర్తిగా ఉన్న క్రీడా ప్రాంగాణాలు పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. 

పూర్తి చేయకుండానే..

ఆటలు ఆడేందుకు వీలుగా క్రీడా ప్రాంగణాలు తయారు కాకముందే తెలంగాణ క్రీడా ప్రాధికారిక సంస్థ గతేడాది జులై, ఆగస్టులో రాష్ట్రంలోని అన్ని క్రీడాప్రాంగణాలకు సరిపడేలా ఒకేసారి 18 వేల స్పోర్ట్స్​ కిట్లను కొనుగోలు చేసి అన్ని మండలాలకు పంపిణీ చేసింది. స్పోర్ట్స్​కిట్​లో వివిధ ఆటలకు సంబంధించి మొత్తం23 ఐటెంలు ఉన్నాయి. రెండు క్రికెట్ బ్యాట్లు, రెండు బ్యాటింగ్ గ్లౌజ్ లు, ఒక వికెట్ కీపింగ్ గ్లౌజ్, 6 క్రికెట్ బాల్స్, 4 సింథటిక్ వాలీబాల్, రెండు వాలీబాల్ నెట్స్

ఒక సైకిల్​పంప్, మూడు డంబెల్స్, రెండు డిస్కస్ త్రోలు,6 టెన్నికాయిట్​రింగ్స్, 4 స్కిప్పింగ్ రోప్స్, ఒక స్టాప్ వాచ్, మూడు ప్లాస్టిక్ విజిల్స్, 75  ప్లేయర్స్ టీ షర్ట్స్ ఉన్నాయి.  ఐటెమ్స్ ను బట్టి ఒక్కో కిట్​విలువ సుమారు రూ.15 వేలు అనుకున్నా మొత్తం కొనుగోలు చేసి జిల్లాలకు సరఫరా చేసిన స్పోర్ట్స్​కిట్స్​విలువ రూ.27 కోట్లు ఉంటుంది.