- రెండు కిలోల సరుకు స్వాధీనం.. నలుగురి రిమాండ్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల రైల్వే స్టేషన్‌సమీపంలో మంగళవారం నలుగురు సభ్యులు గల గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... టౌన్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్ దగ్గర తనిఖీలు చేస్తుండగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. మంచిర్యాలకు చెందిన భూక్య సారయ్య అలియాస్ సాయి, అల్మేకర్ శ్యామ్అలియాస్ మేస్ర్తీ, హమాలివాడకు చెందిన వెంకటేశ్ కొంతకాలంగా గంజాయికి బానిసైన వారు వినియోగించడంతోపాటు ఇతరులకు అమ్ముతున్నారు.
మహారాష్ట్ర బల్లార్షాలో పాస్షాప్ నిర్వహించే ఎస్కే రిజ్వాన్వీరికి మూడు నెలలుగా గంజాయి కిలో రూ.20వేలకు సప్లై చేస్తున్నాడు. వీరు 20 గ్రాముల ప్యాకెట్‌ను రూ.200లకు అమ్ముతున్నారు. ఈ క్రమంలో బల్లార్షా నుంచి గంజాయి తీసుకొస్తున్న రిజ్వాన్ కోసం సాయి, శ్యామ్, వెంకటేశ్ రైల్వేస్టేషన్సమీపంలో ఎదురుచూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రిజ్వాన్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు పంపినట్టు డీసీపీ తెలిపారు. జిల్లాలో గంజాయి రవాణా, వినియోగం బాగా పెరిగిందని.. తమ పిల్లలకు గంజాయికి అలవాటైతే తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పోలీసులను ఆశ్రయిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు కాకుండా చూస్తామని డీసీపీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.