అక్రమ నిర్మాణాలు తొలగించలేదని జీపీకి తాళం

కుభీర్, వెలుగు: అక్రమ నిర్మాణాలు తొలగించకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు నిర్మల్​జిల్లా కుభీర్ గ్రామ పంచాయతీ ఆఫీస్‎కు తాళం వేశారు. కుభీర్  పీహెచ్​సీ కాంపౌండ్​వాల్‎ను ఆనుకొని ఉన్న డ్రైనేజీపై కొందరు రేకుల షెడ్లు వేసుకుని దుకాణాలు నడుపుకుంటున్నారు. వర్షం కారణంగా మేదరి కాలనీ, హాస్పిటల్, విఠలేశ్వర ఆలయంలోకి వర్షపు నీళ్లు రావడంతో హాస్పిటల్ లోపలి నుంచి జేసీబీతో కాలువ తవ్వారు. దీంతో గ్రామస్తులు అక్రమ నిర్మాణాలు తొలగించకుండా తాత్కాలిక కాలువలు ఎందుకు తవ్వుతున్నారని గ్రామపంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అక్రమ నిర్మాణాలు తొలగించి సమస్య పరిష్కరించాలని డిమాండ్  చేశారు.