అవయవాలు అమ్ముకున్న ఘటనపై సర్కారు సీరియస్​

  • డాక్టర్లు, అంబులెన్స్​ డ్రైవర్ల పాత్రపై ఆరా తీసిన డీహెచ్​ 
  • రిపోర్ట్​ ఇవ్వాలని డీఎంహెచ్​వోకు ఆదేశాలు 
  • పకడ్బందీగా పోలీసుల ఎంక్వైరీ 
  • రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం 

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ ​మండలం శెట్​పల్లికి చెందిన రేవెల్లి శ్రీకాంత్​ (35) యాక్సిడెంట్​లో గాయపడి బ్రెయిన్​ డెడ్​ కాగా, కొంతమంది ఆర్గాన్​ డొనేషన్​ పేరుతో అవయవాలను అమ్ముకున్న ఘటనను సర్కారు సీరియస్​గా తీసుకుంది. ఇందులో డాక్టర్లు, అంబులెన్స్​ డ్రైవర్లతో పాటు ఎవరెవరి పాత్ర ఉందన్న విషయమై ఆరా తీస్తోంది. ‘బ్రెయిన్​డెడ్ ​పేషెంట్​ అవయవాలు అమ్ముకున్నరు’ హెడ్డింగ్​తో  గురువారం ‘వెలుగు’లో పబ్లిష్​అయిన కథనానికి డైరెక్టర్​ఆఫ్​హెల్త్​ రవీందర్​ నాయక్​ స్పందించారు.

ఘటనపై రిపోర్ట్​ సమర్పించాలని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీశ్​రాజ్​ను ఆదేశించారు. దీంతో ఆ శాఖ అధికారులు హుటాహుటిన పేషెంట్ ​కుటుంబసభ్యులు, పోలీసులను సంప్రదించి ప్రాథమిక వివరాలు సేకరించారు. సాయంత్రం డీహెచ్​కు ప్రిలిమినరీ రిపోర్టు పం పించారు. మరోవైపు ఘటనపై మంచిర్యాల పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

డాక్టర్లు, అంబులెన్స్​ డ్రైవర్లే కీలకం.. 

మంచిర్యాలలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో ఓటీ టెక్నీషియన్​గా పనిచేస్తున్న శ్రీకాంత్​ఈ నెల 6న జరిగిన యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు. డాక్టర్లు బ్రెయిన్​ డెడ్​ అయినట్టు చెప్పడంతో అంబులెన్స్ డ్రైవర్లు జోక్యం చేసుకొని ‘ఆర్గాన్​ డొనేషన్’ ​ప్లాన్​అమలు చేశారు. మెరుగైన వైద్యం కోసమంటూ కొందరు​ యశోద హాస్పిటల్​కు తీసుకెళ్లాలని, మరికొందరు కామినేని హాస్పిటల్​కు తరలించాలని పేషెంట్​ కుటుంబసభ్యులను ఒత్తిడి చేశారు.

చివరకు కామినేని హాస్పిటల్​కు తీసుకువెళ్లి రెండు రోజుల తర్వాత ఆర్గాన్​ డొనేషన్​ చేయించారు. తమకు రూ.3లక్షలిచ్చి  వాళ్లు భారీగా దండుకున్నట్టు శ్రీకాంత్ ​భార్య స్వప్నపోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో అంబులెన్స్​ డ్రైవర్లతో పాటు కొంతమంది డాక్టర్ల పాత్ర ఉన్నట్టు, రూ.లక్షలు చేతులు మారినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మానవ అవయవాల అక్రమ రవాణాగా పరిగణిస్తున్న ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది.