ఏడుపాయల భద్రతపై నిర్లక్ష్యం..!

  • ఏటా రూ.8 కోట్ల ఆదాయం ఉన్నా రక్షణ కరువు
  • చోరీలు జరుగుతున్నా సెక్యూరిటీ పెంచడం లేదు

మెదక్, పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గామాత ఆలయ భద్రత విషయంలో ఎండోమెంట్ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నా తగిన భద్రత కల్పించ లేదు. ఇదే అదనుగా దొంగలు ప్రధాన ఆలయంలో దర్జాగా చోరీకి పాల్పడుతున్నారు. ఇది వరకు ఒకసారి ఈవో ఆఫీస్​లో, మరోసారి అమ్మవారి గర్భ గుడిలో చోరీ జరుగగా తాజాగా మళ్లీ ప్రధాన ఆలయంలో దొంగలు పడి ఏకంగా హుండీలను ఎత్తుకెళ్లారంటే ఇక్కడ సెక్యూరిటీ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి ఏడాది పొడుగునా తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారు. ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో 20 నుంచి 30 వేల మంది భక్తులు వస్తారు. మహా శివరాత్రి జాతరకు ఐదు లక్షల మంది వరకు వస్తారు. టెండర్లు, వాహన పూజలు, ప్రత్యేక దర్శన టికెట్లు, లడ్డూ, పులిహోరా ప్రసాదాల అమ్మకాలు, సత్రాల కిరాయిలు, దుకాణాల అద్దెలు, భక్తులు సమర్పించే కానుకల రూపంలో ఏటా ఆలయానికి రూ.8 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది.

వనదుర్గా మాతకు విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆలయం వద్ద తగిన భద్రత కల్పించే విషయంలో మాత్రం అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఆలయం వద్ద పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. పది మంది ప్రైవేట్​సెక్యూరిటీ సిబ్బందిని నియమించగా వారు ముగ్గురు చొప్పున షిప్టుల వారీగా పనిచేస్తున్నారు. కాగా రాత్రిపూట ప్రధాన ఆలయం వద్ద ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఆలయానికి దూరంగా ఉన్నఈవో ఆఫీస్​వద్ద ఉంటున్నారు. 

పేరుకే ఔట్​పోస్ట్​

ఏడుపాయలలో  పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్​ చాలా ఏళ్ల నుంచి ఉంది. మూడేళ్ల కింద ఆర్​డబ్ల్యూఎస్​కు సంబంధించిన బిల్డింగ్​లో ఔట్​ పోస్ట్​ఏర్పాటు చేశారు. కానీ అక్కడ రెగ్యులర్​గా పోలీసులు ఉండడం లేదు. కేవలం ఆదివారాలు, వీఐపీలు వచ్చిన సందర్భాల్లో మాత్రమే పోలీస్​బందోబస్తు ఉంటోంది. 2022‌‌లో ఆలయం గర్భగుడి గడపకు అమర్చే వెండి తొడుగు ఈవో ఆఫీస్​లో నుంచి చోరీకి గురైంది. మరో ఘటనలో గర్భగుడి కిటికీ బద్దలు కొట్టి​ అందులో నుంచి ఓ దొంగ లోపలికి  ప్రవేశించి హుండీని పగుల గొట్టి నగదు, బంగారు, వెండి కానుకలను ఎత్తుకెళ్లాడు.

తాజాగా శుక్రవారం రాత్రి ప్రధాన ఆలయంలో మళ్లీ దొంగలు పడ్డారు. మండపానికి ఉన్న ఇనుప గ్రిల్​డోర్​ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి రెండు హుండీలను ఎత్తుకెళ్లి తాళాలు పగులగొట్టి  భక్తులు వేసి నగదు, వెండి, బంగారు కానుకలను చోరీ చేశారు. దీంతో ఏడుపాయల ఆలయం వద్ద సెక్యూరిటీని పెంచడంతో పాటు ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే పోలీస్​ఔట్ పోస్ట్​లో రెగ్యులర్​గా పోలీసులు ఉండేలా, పెట్రోలింగ్​నిర్వహించేలా పోలీస్​అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.