మెదక్​లో ఖర్జూర పంట పండింది

  •     ఎడారి ప్రాంతాల్లోని పంటను పండించిన సత్యనారాయణ
  •     రైతు ప్రయోగం సక్సెస్​

మెదక్, రామాయంపేట, వెలుగు : గల్ఫ్​ దేశాల్లో మాత్రమే పండే ఖర్చూర పంటను మెదక్​ జిల్లాలో సాగు చేసి చూపించాడు సత్యనారాయణ అనే రైతు. మూస ధోరణిలో సంప్రదాయ పంటలు సాగు చేయకుండా ఖర్జూర వేసి సక్సెస్​ అయ్యాడు.  సత్యనారాయణ కొన్నేండ్ల కింద మెదక్ జిల్లా రామాయంపేటలో నేషనల్​ హైవే 44 పక్కన భూమి కొన్నాడు. అనారోగ్యానికి గురైన టైంలో ఓ గురువు చెట్లు పెంచమని చెప్పగా ఆలోచించాడు. యూ ట్యూబ్​లో సుధీర్​నాయుడు ప్రోగ్రామ్స్​ చూసి ఆయనతో మాట్లాడాడు. ఆయన సలహా మేరకు ఖర్జూర సాగు చేయాలనుకున్నాడు.

 2018లో ప్రయోగాత్మకంగా 280 ఖర్జూర మొక్కలు నాటారు. అవి పెరగడంతో 13 ఎకరాల్లో వెయ్యి మొక్కలు నాటాడు. ఇరాన్ ల్యాబ్​లో తయారయ్యే ఎలైట్, బర్గి రకాల ఖర్జూర సీడ్స్​ను చెన్నై ఏజెంట్ ద్వారా తీసుకువచ్చాడు. ఖర్జూర మొక్కలను ఎనిమిది మీటర్ల దూరంతో ఎకరాకు 68 మొక్కల చొప్పున నాటి డ్రిప్ సిస్టం ద్వారా నీరందిస్తూ, మల్చింగ్ సిస్టం ఏర్పాటు చేసి సంరక్షించాడు. 90 శాతం ఫిమేల్​మొక్కలు, 10 శాతం మేల్​మొక్కలు నాటాడు. సాగును పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే చేపట్టాడు. ఆవులను పెంచుతూ మూత్రం, పేడను ఎరువులుగా ఉపయోగిస్తున్నాడు.

 మొదట్లో నాటిన ఖర్జూర మొక్కలకు గత జనవరిలో పూత ప్రారంభం కాగానే మేల్ ఖర్జూర మొక్కల పువ్వుల నుంచి పుప్పొడి రేణువులను సేకరించి ఫిమేల్ మొక్కల పువ్వులకు రాశాడు. దీంతో ఫలదీకరణం చెంది ఖర్జూర గెలలు వేశాయి. ఈ ఖర్జూర మొక్కలు ఒకసారి నాటితే 80 ఏండ్ల వరకు దిగుబడి వస్తుందని రైతు చెబుతున్నాడు. తోటలో అంతర పంటగా అంజీర్, అవకాడో, వాటర్ ఆపిల్, పింక్​, వైట్​డ్రాగన్, జీడి మామిడి పండ్ల మొక్కలు నాటాడు. ఆయుర్వేదంలో క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే లక్ష్మణ సీతాఫలం చెట్లు కూడా నాటాడు. 

విషయం తెలుసుకున్న జిల్లా హార్టికల్చర్​ ఆఫీసర్లు, పలువురు రైతులు పంటను పరిశీలించారు. సత్యనారాయణ మాట్లాడుతూ  ఈ ఏడాది నుంచే కాత ప్రారంభమైందని, ఒక్క చెట్టుకు 100 కిలోల దిగుబడి వస్తుందని చెప్పాడు.ఇండోనేషియా వ్యాపారులు ఖర్జూరాలను వారికి అమ్మాలని కోరుతున్నారని, కానీ మొదటి పంటను ఈ ప్రాంతవాసులకే అమ్మాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.