- వాడీవేడిగా క్యాతనపల్లి మున్సిపల్ సమావేశం
- ఆమోదం లేకుండానే బిల్లులు మంజూరు చేస్తున్నారంటూ ఆగ్రహం
కోల్‌బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపల్ జనరల్‌బాడీ సమావేశం వాడీవేడిగా సాగింది. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ అధ్యక్షతన బుధవారం జనరల్‌బాడీ సమావేశం జరిగింది. వార్డుల్లో సమస్యలు పరిష్కరించడంలో కమిషనర్ నిర్లక్ష్యం చేస్తున్నా రని, ప్రజాప్రతినిధులు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.
కౌన్సిల్ఆమోదం లేకుండా ఇంజనీరింగ్పనులకు సంబంధించిన రూ.4.18 లక్షల బిల్లులు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. రోడ్లపై డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. తాము ఫిర్యాదు చేస్తే దృష్టిపెట్టని కమిషనర్.. తనకు అనుకూలంగా ఉన్న లీడర్లు చెప్తే స్పందిస్తున్నారని, కనీసం సానిటేషన్ పనులు కూడా చేయించడంలేదంటూ అధికార, ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు.
చైర్పర్సన్ సైతం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కమిషనర్, చైర్పర్సన్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ప్రజాప్రతినిధులను కమిషనర్ చులకనగా చూస్తున్నాడని అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం నిరసన వ్యక్తంచేశారు. నిరసనల నేపథ్యంలో 12 అంశాలతో కూడిన ఏజెండాకు కౌన్సిలర్లు ఆమోదం తెలపలేదు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. మున్సిపల్వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, ఏఈ అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.