ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన

బెజ్జంకి, వెలుగు : తమ గ్రామంలో ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్​చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం, నరసింహుల పల్లె గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి ఫ్యాక్టరీ ప్రతినిధులతో కలిసి గ్రామస్తులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల కాలుష్యం, కలుషిత నీరు, వ్యర్ధాలు బయటకు రావన్నారు.

ఇథనాల్ లిక్విడ్ తయారీ కోసం300 టన్నుల బియ్యం, 340 టన్నుల మక్కలు, 8 టన్నుల గడ్డి, ఉనుక వాడుతారని చెప్పారు. వేస్టేజ్ ద్వారా పశువులకు, కోళ్లకు దాన ఉత్పత్తి అవుతుందన్నారు. గ్రామస్తులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కానీ గ్రామస్తులు పచ్చని గ్రామంలో ఫ్యాక్టరీ పేరుతో చిచ్చుపెట్టొద్దని, దీనివల్ల భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుందని, కాలుష్యం కోరల్లో గ్రామం బలవుతుందని అడిషనల్​కలెక్టర్ కు తెలిపారు. ఆయన గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు.