- నెన్నెల తహసీల్దార్ ఆఫీసు ఎదుట పురుగుల మందు డబ్బాతో కుటుంబం బైఠాయింపు
- అడ్డుకుని లాక్కున్న ఎస్సై
- కంప్లయింట్ ఉండడంతో రిజిస్ట్రేషన్ చేయలే : తహసీల్దార్
బెల్లంపల్లి రూరల్, వెలుగు : భూమి రిజిస్ట్రేషన్చేయకుండా తహసీల్దార్ తిప్పుకుంటున్నాడని, వెంటనే రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఇద్దరు అన్నదమ్ములు శుక్రవారం మంచిర్యాల జిల్లా నెన్నెల తహసీల్దార్ ఆఫీసు ఎదుట పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. మండలంలోని గొల్లపల్లికి చెందిన చింత విఘ్నేష్, విష్ణు సర్వే నంబర్ 332లో దమ్మ సునీత నుంచి కొద్ది రోజుల కింద ఏడెకరాల భూమిని కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల7న స్లాట్ బుక్ చేసుకున్నారు. అయితే, తహసీల్దార్రమేశ్..రేపు, మాపు అంటూ వారం నుంచి తిప్పుకుంటున్నాడని
శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి ఆఫీసుకు వచ్చారు. సాయంత్రం వరకు ఉన్నప్పటికీ ఆఖరు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని తహసీల్దార్ చెప్పడంతో విసుగు చెంది అక్కడే నిరసనకు దిగారు. ఆఫీసు ఎదుట కుటుంబసభ్యులతో కలిసి పురుగుల మందు డబ్బా పట్టుకుని బైఠాయించారు. స్లాట్‌బుక్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పురుగుల మందు తాగి చస్తామని బెదిరించారు. దీంతో విషయం తెలుసుకున్న ఎస్సై ప్రసాద్ అక్కడకు చేరుకుని వారిని తహసీల్దార్ రమేశ్ ఛాంబర్‌కు తీసుకువెళ్లారు.
అక్కడ మాట్లాడుతుండగా విష్ణు పురుగుల మందు డబ్బా బయటకు తీసి తాగే ప్రయత్నం చేయగా ఎస్సై ప్రసాద్లాక్కున్నారు. వెంటనే బయటకు వెళ్లిన విష్ణు మరోసారి ఆఫీసు ఎదుట మరో పురుగుల మందు డబ్బా పట్టుకుని తాగి చనిపోతానని హెచ్చరించాడు. మళ్లీ ఎస్సై అతడితో మాట్లాడి తహసీల్దార్దగ్గరకు తీసుకువెళ్లాడు. రాజేశ్వర్‌రావు అనే వ్యక్తి రిజిస్ట్రేషన్‌పై అభ్యంతరాలున్నాయని ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్ చేయడం లేదని తహసీల్దార్ రమేశ్ వారికి వివరించాడు. ఎంక్వైరీ చేసి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు.