అరెస్ట్​ చూపించిన అరగంటకే..పోలీస్​ కస్టడీ నుంచి నిందితుడు పరార్​

  • మంచినీళ్లు కావాలంటూ మస్కా 
  • జుబేర్​పై ఇది వరకే పలు కేసులు
  • ముమ్మరంగా గాలిస్తున్న నాలుగు స్పెషల్​ టీమ్స్​

బైంసా, వెలుగు : బైంసా టౌన్​ పీఎస్​పరిధిలో ఆర్మ్స్ యాక్టు కేసులో అరెస్టయిన నిందితుడు శుక్రవారం పోలీస్​ కస్టడీ నుంచి పరారయ్యాడు. పట్టణ పరిధిలోని నయాబాద్ కాలనీకి చెందిన అబ్దుల్ జుబేర్ (27)పై టౌన్​ పీఎస్​లో ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులున్నాయి. పీడీ యాక్టు పెట్టడంతో పాటు రౌడీ షీట్ ​కూడా ఓపెన్ ​చేశారు. గత మార్చిలో ఫ్రెండ్​ను చంపిన కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు. గురువారం నాందేడ్ క్రాస్ రోడ్డు సమీపంలో టౌన్ ఎస్ఐ షరీఫ్ పెట్రోలింగ్ ​చేస్తుండగా జుబేర్​అనుమానాస్పదంగా కనిపించాడు.

అతడిని చెక్​చేయగా కత్తి దొరికింది. అతడి ఇంటికి తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహించగా తల్వార్ లభించింది. సోషల్​మీడియా అకౌంట్ ​చెక్​చేయగా కత్తులు పట్టుకుని ఉన్న ఫొటోలు కనిపించాయి. దీంతో పోలీసులు ఆర్మ్స్​యాక్టు కింద కేసు నమోదు చేశారు.  శుక్రవారం భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ టౌన్​ పీఎస్​లో సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. తర్వాత రిమాండుకు తరలించే ఏర్పాట్లలో పోలీసులు నిమగ్నమయ్యారు.  

దాహం వేస్తోందని...

కస్టడీలో ఉన్న నిందితుడు అబ్దుల్ జుబేర్ అక్కడున్న కానిస్టేబుల్స్​ను మంచినీళ్లు కావాలని అడిగాడు. ఒక కానిస్టేబుల్ నీళ్లు తెచ్చేందుకు వెళ్లగా మరో కానిస్టేబుల్ కళ్లు గప్పి రూమ్​నుంచి బయటపడ్డాడు. తర్వాత పీఎస్ ​మెయిన్​గేట్​నుంచి పారిపోయాడు. సెకన్ల వ్యవధిలోనే నిందితుడు పారిపోతున్నట్లు గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు యత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.  దీంతో జుబేర్ ను పట్టుకునేందుకు టౌన్ సీఐ రాజారెడ్డి నేతృత్వంలో నాలుగు స్పెషల్​ టీమ్స్​ ఏర్పాటు చేశారు.