మంచిర్యాల జిల్లాలో ఆర్​ఎంపీ క్లినిక్​లపై టీజీఎంసీ, ఐఎంఏ దాడులు

  • హైడోస్​ యాంటీబయోటిక్స్, ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు లభ్యం
  • హాస్పిటల్స్​ను తలపించేలా క్లినిక్​లు, మెడికల్​షాపులు ఏర్పాటు
  • అర్హత లేకున్నా ట్రీట్​మెంట్​ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం

చెన్నూర్/జైపూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూర్, భీమారం మండల కేంద్రాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్​లపై తెలంగాణ మెడికల్ ​కౌన్సిల్​(టీజీఎంసీ), ఇండియన్ ​మెడికల్​అసోసియేషన్​(ఐఎంఏ) ప్రతినిధులు బుధవారం రాత్రి ఆకస్మిక దాడులు చేశారు. క్లినిక్​లకు వచ్చే పేషెంట్లకు హైడోస్​ యాంటీబయోటిక్స్, ప్లూయిడ్స్, ఇంజక్షన్లు వాడడంతో పాటు రూల్స్​కు విరుద్ధంగా హాస్పిటల్స్​ను తలపించేలా బెడ్స్​ వేసి ట్రీట్​మెంట్​ చేస్తున్నట్లు గుర్తించారు. చెన్నూర్ ​బస్టాండ్​ఎదురుగా శ్రీకిరణ్ ​హాస్పిటల్​నడుపుతున్న బండారి లక్ష్మణ్, భీమారానికి చెందిన రంజిత్​కుమార్​పై ఫిర్యాదులు

 రావడంతో వారి క్లినిక్​లపై ఆకస్మిక దాడులు నిర్వహించినట్టు టీజీఎంసీ మెంబర్​ డాక్టర్​ యెగ్గెన శ్రీనివాస్​ తెలిపారు. ఆర్​ఎంపీలు ఫస్ట్​ఎయిడ్ ​మాత్రమే చేయాల్సి ఉండగా, వీరిద్దరూ అర్హత లేకున్నా బెడ్స్​వేసి సెలైన్లు పెడుతూ ఇంజక్షన్లు ఇస్తున్నారని చెప్పారు. హైడోస్ ​యాంటీబయోటిక్స్‌, నొప్పుల మందులు, ఫ్లూయిడ్స్, ఇతర హై షెడ్యూల్ డ్రగ్స్​ఇస్తూ ప్రజల ప్రాణాలతో  చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. డాక్టర్లుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాకుండా క్లినిక్​లకు అనుబంధంగా మెడికల్‌ షాపులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. 

రంజిత్​కుమార్​ఫార్మా-డీ సర్టిఫికెట్​తో మెడికల్​ షాపు నడపడమే కాకుండా క్లినిక్​ఏర్పాటు చేసి పేషెంట్లకు ట్రీట్​మెంట్​ అందిస్తున్నారని చెప్పారు. వీరిపై టీజీఎంసీతో పాటు ఐఎంఏకు రిపోర్టు పంపామన్నారు. దాడుల్లో టీజీఎంసీ మెంబర్స్​ ముత్తినేని అనిల్, సంతోష్, ప్రసాద్, శ్రీధర్ పాల్గొన్నారు. 

ఆర్ఎంపీల నిరసన

చెన్నూర్, భీమారంలోని ఆర్ఎంపీ క్లినిక్​లపై టీజీఎంసీ, ఐఎంఏ సభ్యుల దాడులను నిరసిస్తూ చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన ఆర్ఎంపీలు గురువారం చెన్నూర్​లో ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎంపీలను అణిచివేసేందుకే తనిఖీల పేరిట ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దాడులను ఆపాలని కోరుతూ బస్టాండ్​నుంచి తహసీల్దార్​ఆఫీస్​ వరకు ర్యాలీ తీసి తహసీల్దార్​కు మెమోరాండం అందజేశారు.