- అవార్డు ప్రకటనకు సిద్ధమవుతున్న అధికారులు
- ఎకరానికి 6 నుంచి 8 లక్షలు ఇస్తారని ప్రచారం
- తక్కువ పరిహారంతో నష్టపోతామని ఆందోళన
సిద్దిపేట, వెలుగుః రీజనల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులను సరైన పరిహారం అందుతుందాలేదా అన్న టెన్షన్ వెంటాడుతోంది. పరిహారాలకు సంబంధించి ఇదివరకే త్రీ డీ నోటిఫికేషన్ ను విడుదల చేసి.. నిర్వాసితులతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. త్వరలో అవార్డు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ట్రిపుల్ఆర్ కింద సేకరిస్తున్న భూములకు ఎకరానికి రూ. 6 లక్షల నుంచి 8 లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
విలువైన భూములు తీసుకుని నామమాత్రంగా పరిహారం ఇస్తే తాము తీవ్రంగా నష్టపోతామని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ట్రిపుల్ ఆర్ దాదాపు 32 కిలో మీటర్ల వరకు ఉంటోంది. దీనికోసం 962.27 ఎకరాలను సేకరించాలని నిర్ణయించిన అధికారులు మార్కింగ్ చేశారు.
జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి, ఇటిక్యాల, అలీరాజనేట , మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, పాములపర్తి, గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్, ముట్రాజ్ పల్లి, సంగాపూర్, మక్త మాసాన్ పల్లి, బంగ్ల వెంకటాపూర్, వర్గల్ మండలం మైలారం, జబ్బాపూర్, నెంటూర్, రాయపోల్ మండలం బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో 1,168 మంది రైతుల నుంచి ఈ భూములను సేకరించనున్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వల్ల బ్రేక్ పడిన భూసేకరణ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.
త్వరలో అవార్డు ప్రకటన
ట్రిపుల్ఆర్ కోసం సేకరిస్తున్న భూముల పరిహారానికి సంబంధించి త్వరలో అధికారులు అవార్డు ప్రకటించనున్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ‘కాలా’(కాంపిటెంట్ అథార్టీ ఫర్ ల్యాండ్ అక్విజేషన్) లను నియమించి భూసేకరణ ప్రారంభించారు. భూ సేకరణకు సంబంధించి త్రీడీ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. రైతులతో నిర్వహించి మీటింగ్‌ల్లో భూసేకరణ, పరిహారాలకు సంబంధించి అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా తెలయజేయాలని అధికారులు సూచించారు. దీంతో పరిహారాలకు సంబంధించి పలువురు అభ్యంతరాలను అందజేశారు.
పెండింగ్ లో అలైన్మెంట్ మార్పు
ట్రిపల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలన్న ప్రతిపాదన రాగా ఆ అంశం ఇప్పుడు పెండింగ్ లో పడిందని తెలుస్తోంది. భూసేకరణ దశలో అలైన్ మెంట్ మారిస్తే పనుల్లో జాప్యం జరుగుతుందని అధికారులు అంటున్నారు. కొంతకాలం కింద రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంటకరెడ్డి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
పచ్చని పంటలు పండే విలువైన భూముల గుండా వెళ్తున్న రోడ్డు అలైన్మెంట్ మారితే తమకు ప్రయోజనం కలుగవచ్చునని రైతులు ఆశిస్తున్నారు. నెల రోజుల కింద మర్కుక్ మండలానికి చెందిన నిర్వాసితులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలసి అలైన్మెంట్ మార్చాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. గజ్వేల్రింగ్రోడ్డుకు ట్రిపుల్ ఆర్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిబంధనల ప్రకారం రింగ్రోడ్డునుంచి మరో రింగ్‌రోడ్డు కనీసం 60 కిలో మీటర్ల దూరం ఉండాలి. ఈ అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.