స్పామ్ కాల్స్ అరికట్టేందుకు ట్రాయ్‌‌ పైలెట్ ప్రాజెక్ట్

న్యూఢిల్లీ: స్పామ్‌‌ కాల్స్‌‌ను తగ్గించేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌‌) త్వరలో ఓ పైలెట్ ప్రాజెక్ట్‌‌ను లాంచ్ చేయనుంది.   కమర్షియల్ కాల్స్‌‌కు గతంలో  యూజర్లు అనుమతి ఇస్తే, ఈ అనుమతులన్నింటిని తన   డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్‌‌టీ) ప్లాట్‌‌ఫామ్‌‌కు  మారుస్తామని ప్రకటించింది. భవిష్యత్‌‌లో  యూజర్లు కోరుకుంటే  కమర్షియల్ కాల్స్‌‌ రాకుండా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ‘ప్రస్తుతం  ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ లేదా సెల్లర్ నుంచి  కాల్స్‌‌, మెసెజ్‌‌లు వస్తుంటే, మీరు దాన్ని స్పామ్‌‌ అని ఫిర్యాదు చేస్తున్నారు.

 కానీ, ఈ సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం తమ దగ్గర  యూజర్ ఇచ్చిన అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ అనుమతులు పేపర్‌‌‌‌పై ఉన్నాయి. కానీ, సిస్టమ్‌‌లో రికార్డ్ అయి లేవు. అందుకే గతంలో యూజర్లు ఇచ్చిన​ అనుమతులన్నింటిని   డీఎల్‌‌టీ ప్లాట్‌‌ఫామ్‌‌కు మార్చాలని నిర్ణయించుకున్నాం.  అనుమతి ఇవ్వకపోయినా కమర్షియల్ కాల్స్ వస్తుంటే, యూజర్‌‌‌‌  ఎలా ఎగ్జిట్ అవ్వాలో చూడడమే ప్రస్తుతం మా ముందున్న సమస్య. ఈ నెలలో పైలెట్ ప్రాజెక్ట్‌‌ మొదలు పెడతాం. కొంత మంది సర్వీస్ ప్రొవైడర్లు, సంస్థలతో కలిసి పనిచేస్తాం’ అని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి వివరించారు.