ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు

  • నిర్మల్– భైంసా మెయిన్ రోడ్డుపై రాస్తారోకో
  • రోడ్డుపైనే ఐదుగ్రామాల ప్రజల వంటావార్పు

నిర్మల్, వెలుగు:  ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఐదు గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. వెంటనే ఫ్యాక్టరీ పనులను నిలిపివేసి తరలించాలని డిమాండ్ చేశారు.  నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ – గుండంపల్లి గ్రామాల మధ్య పరిశ్రమను నిర్మిస్తుండగా ఐదు గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు దిలావర్ పూర్ వద్ద  నిర్మల్ – భైంసా ప్రధాన రహదారిపై బైఠాయించారు. దిలావర్పూర్, గుండంపెల్లితో పాటు సముందర్ పల్లి , టెంబుర్ని, సిర్గాపూర్ కాండ్లీ  గ్రామాల రైతులు,  మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. 

పార్టీలకతీతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు.   ఆయా గ్రామాల్లో షాపులను స్వచ్ఛందంగా మూసివేయడమే  కాకుండా స్కూళ్లను బంద్ పెట్టి నిరసన తెలిపారు. రాత్రి వరకు రాస్తారోకోను కొనసాగిస్తుండగా.. రైతులకు నచ్చచెప్పేందుకు వచ్చిన ఆర్డీఓ రత్న కళ్యాణిని అడ్డుకున్నారు. రాస్తారోకోతో ఇరువైపులా దాదాపు పది కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సిర్గాపూర్ నుండి బీరవెల్లి , కాల్వ, గోలమాడ,  కుంటాల మీదుగా భైంసాకు మళ్లించారు. 

మాజీ మంత్రి,  ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు  

ఇథనాల్  ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మూడు నెలలుగా ఆందోళనలు  చేస్తున్నా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు పట్టించుకోవడం లేదంటూ రైతులు మండిపడ్డారు. ఆయా నేతలు  కనిపించడం లేదంటూ ఫొటోలతో ప్ల కార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి,  నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  

ఇథనాల్ ఫ్యాక్టరీ పై జిల్లా కలెక్టర్,  అడిషనల్ కలెక్టర్ల కూడా రైతులతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమ గ్రామాలు, పంట పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఇక్కడ వద్దంటూ పట్టుబడుతున్నారు. ఇలా ఫ్యాక్టరీ యాజమాన్యం, అధికారులు  చర్చలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. పోలీసులు కూడా ఆందోళన విరమించాలని కోరారు. అయినా ప్రజలు ఫ్యాక్టరీ ఎత్తివేత పై స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు.

8 గంటల పాటు ఆర్డీవో నిర్బంధం

దిలావర్ పూర్ వద్ద ఆందోళన చేపట్టిన రైతులను సముదాయించేందుకు వచ్చిన ఆర్డీవో రత్న కల్యాణిని దాదాపు 8 గంటల పాటు నిర్బంధించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు ఆమె వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎట్టకేలకు పోలీసులు ఆర్డీవోను నిర్మల్ కు తరలించారు. ఇథనాల్  ఫ్యాక్టరీని తరలించాలని రైతులు చేపట్టిన బంద్ రాస్తారోకో సంబంధించిన నివేదికను సీఎం ఆఫీసుకు పంపినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతుల సమస్యను కూడా సీఎం ఆఫీస్ కు నివేదికలో వివరించినట్లు కలెక్టర్ వెల్లడించారు.