Telangana Tour : రామగిరి గుట్టలు.. ప్రకృతి సిరి.. చూసొద్దామా సరదాగా

కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన కోట ఒక అద్భుతం. చుట్టూ పచ్చని చెట్లు.. ఎత్తైన గుట్టల మధ్య ఉన్న ఈ ఖిల్లా ఒకప్పటి శిల్ప కళా సంపదకు నిలయం. రాతిపై చెక్కిన సుందర దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. 

చుట్టూ కోటలే..

రామగిరి దుర్గంలో సాలు కోట, సింహల కోట, జంగే కోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల, కొలువుశాల, మొఘల్యాల, చెరశాల, గజశాల, భజన శాల, సభాస్థలితో పాటు చక్కెర బావి, సీతమ్మ బావి, పసరు బావి, సీతమ్మ కొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు పర్యాటకులను మైమరిచిపోయేలా చేస్తాయి.

రాయికల్ జలపాతం

కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని రాయికల్ గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో రాయికల్ జలపాతం ఉంది. మరోవైపు వరంగల్ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం ఉంది. దాదాపు 170 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం కనువిందు చేస్తుంది. రామగిరి ఖిల్లా పరిసరాల్లో చాలా జలపాతాలున్నాయి. సీతమ్మధార, పాండవుల లంక. కంకలోయ, లొద్దీ, హవేలిమూలతో పాటు పెద్దపల్లి జిల్లా సబితంలో గౌరిగుండాల జలపాతం, రామగుండంలో రామునిగుండాల, సీతమ్మ కొల్లుగుంట, పులిగుండం, రాయికల్లో, రాయికల్ జలపాతం ఉన్నాయి. రామగిరి ఖిల్లాను సందర్శించాలనుకునే వారు ఈ ప్రాంతాలను కూడా చూడొచ్చు. 

గుహలో సీతారాముల విగ్రహాలు

సెలవులు, పండగల సమయంలో రామగిరి ఖిల్లాపై పర్యాటకుల సందడి ఉంటుంది. అంతేకాదు ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లా చుట్టు పక్కల అటవీ ప్రాంతంలో విలువైన వనమూలికలు సేకరిస్తుంటారు. అయితే కొండపై ఉన్న కోట, దర్శనీయ ప్రాంతాలు, కొండ గుహలో కొలువైన సీతారాములను దర్శించుకోవాలంటే దాదాపు పదహారు కిలోమీటర్లు కొండ మీద వెళ్లాలి.

రాముని గుండాలు

రామగుండం గుట్ట పైనున్న చెరువు నీళ్లు ఉత్తరం వైపునకు ప్రవహిస్తూ చిన్న చిన్న జలపాతాల్లా దర్శనమిస్తాయి. ఇవే రాముని గుండాలు. సబ్బితం సమీపంలో సుమారు 150 అడుగుల ఎత్తున కొండలపై నుంచి పారుతున్నట్లు కనిపిస్తుంది ఈ జలపాతం. 

ఇలా చేరుకోవాలి

పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి మంథని, కాళేశ్వరం వెళ్లే మార్గంలో 58 కిలోమీటర్ల దూరంలో రామగిరి దుర్గం ఉంది. కమానప్పూర్ మండలంలోని నాగెపల్లి (బేగంపేట అడ్డరోడ్డు) నుంచి బేగంపేట మీదుగా నడుచుకుంటూ వెళ్తే రామగిరి ఖిల్లాకు చేరుకోవచ్చు. అయితే, రామగిరి ఖిల్లాని పూర్తిగా చూడాలంటే కనీసం పదహారు కిలోమీటర్లు కొండపైన నడవాలి. రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు కాజీపేట-బల్లార్షా మార్గంలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్లో దిగి బస్సు ద్వారా మంథని మార్గంలో బేగంపేటకు చేరుకోవచ్చు.

Also Read :టైం తీసుకోండి.. అడగండి.. వినండి..