కాకా ఫ్యామిలీని విమర్శించే అర్హత లేదు

కోల్​బెల్ట్, వెలుగు : పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 50 ఏండ్లుగా ప్రజాసేవ చేస్తున్న కాకా వెంకటస్వామి ఫ్యామిలీని విమర్శించే నైతిక హక్కు ఎమ్మార్పీఎస్ ​వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు లేదని జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల  కాకా కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మందకృష్ణ తరచూ కాకా కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

కాకా వెంకటస్వామి సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చా రని, సీడబ్ల్యూసీ మెంబర్​గా తెలంగాణ ఏర్పా టుకు సోనియా గాంధీని ఒప్పించారని గుర్తుచే శారు. లక్షలాది మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించారని, నష్టాల బాటలో ఉన్న సింగరేణిని కాపాడేందుకు రూ.400 కోట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ ​విధానం తీసుకొచ్చింది కాకా వెంకటస్వామేనని అన్నారు.

ఆయన కుమారులు వివేక్​వెంకటస్వామి, వినోద్​ ఎమ్మెల్యేలుగా, మనవడు గడ్డం వంశీకృష్ణ ఎంపీగా ప్రజాసేవలో  కొనసాగుతున్నారని, విశాఖ ట్రస్ట్​ ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్నో సామాజిక సేవలు చేసిన ఘనత కాకా కుటుంబానిదని కొనియాడారు. దళిత, బడుగు, బలహీనవార్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటే ఓర్వలేక ఆ కుటుంబంపై విమర్శలు చేయడం తగదన్నారు.