- మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోజాతీయ పతాకాలను ఆవిష్కరించిన కలెక్టర్లు
- అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న అధికారులు, ఉద్యోగులు
మెదక్, సంగారెడ్డి టౌన్, సిద్దిపేట, వెలుగు : జిల్లాను అభివృద్ధి పథంలో అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్రాహుల్రాజ్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం మెదక్ కలెక్టరేట్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో ఉద్యమకారుల, మహానుభావుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటేలా, ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహించుకుంటున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.
ఎందరో మహానుభావులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొని ఉన్నత స్థానానికి ఎదిగారని తెలిపారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మంచి ఫలితాలు సాధించాలని స్టూడెంట్స్కు సూచించారు. ప్రభుత్వ స్కూళ్లను ఆదర్శ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టామన్నారు. జిల్లా అంతటా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి బడిలో చదివే పిల్లల తల్లుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా స్కూళ్లలో స్టూడెంట్స్ నమోదు శాతం పెంచేందుకు చర్యలు చేపడుతామన్నారు. వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ హేమలత, మున్సిపల్ చైర్మన్చంద్రపాల్, ఎస్పీ బాలస్వామి, అడిషనల్కలెక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ మహేందర్ పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి టౌన్ : అమరుల ఆశయాలను, ఆకాంక్షలను స్మరిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దామని కలెక్టర్ వల్లూరు క్రాంతి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి నాటి ఉద్యమ పోరాటగట్టాలను నెమరు వేసుకున్నారు. సుదీర్ఘంగా సాగిన స్వరాష్ట్ర పోరాట ఉద్యమంలో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి వందనం సమర్పించారు.
డీఆర్డీవో ఆధ్వర్యంలో పాస్లస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిదాం అనే నినాదంతో ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలను తిలకించారు, స్టూడెంట్స్చేసిన సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్పీ రూపేశ్, ట్రైనీ ఐఏఎస్ మనోజ్, అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేటలో..
సిద్దిపేట : అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ దశాబ్దకాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్ మను చౌదరి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కేవలం భౌగోళిక రూపం కాదని ఆస్తిత్వ పోరాటానికి నిదర్శనమని, ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుందన్నారు. తెలంగాణ ప్రత్యేక సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను కలిగి ఉండి తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ భాషలను మాట్లాడుతూ దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సిద్దిపేట జిల్లా ప్రజలు కీలక పాత్ర పోషించారని సిద్దిపేట కవులకు, మేధావులు ఉద్యమానికి ఊపిరిలూదారని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో సీపీ అనురాధ, అడిషనల్కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.