‘లోన్​యాప్స్’ వేధింపులు.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

  • సూసైడ్​కు ముందు సెల్ఫీ వీడియో

నస్పూర్, వెలుగు: స్టాక్​మార్కెట్​లో నష్టాలు రావడం, లోన్​యాప్స్​నిర్వాహకుల వేధింపులతో మంచిర్యాల జిల్లా నస్పూర్​కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అరుణక్క నగర్ కాలనీకి చెందిన నమ్తబాజీ శ్రీకాంత్(29) కొన్నేండ్లుగా స్టాక్ మార్కెట్ లో ఇన్​వెస్ట్​చేస్తున్నాడు. ఇందుకు లోన్ యాప్స్​లో అప్పు తీసుకున్నాడు. 

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో నష్టాలు రావడంతో లోన్ యాప్స్ లో తీసుకున్న అప్పులు చెల్లించలేదు. దీంతో వారు అప్పు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ‘స్టాక్  మార్కెట్ ట్రేడింగ్ లో నష్టపోయాను. లోన్ యాప్స్ లో, తెలిసిన వారి నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక సూసైడ్​ చేసుకుంటున్నాను’ అని శుక్రవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకున్న శ్రీకాంత్ అనంతరం ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడికి భార్య శ్రుతి, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. శ్రుతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామనిశ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.