ఆపరేషన్ ముస్కాన్ స్టార్ట్ 

  • జిల్లాలో 3 ప్రత్యేక బృందాల ఏర్పాటు
  • ఏడేండ్లలో 306  మందికి విముక్తి
  • ఈ నెలాఖరు వరకు విస్తృత తనిఖీలు

సిద్దిపేట, వెలుగు : బడి బాట పట్టాల్సిన చిన్నారులు చదువుకు దూరమై బాల కార్మికులుగా మారుతున్నారు. వారిని గుర్తించి బడికి పంపించే కార్యక్రమానికి అధికారులు మరోసారి శ్రీకారం చుట్టారు. బాల కార్మికులుగా మారుతున్న చిన్నారులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ ను ప్రారంభించింది. సిద్దిపేట జిల్లాలో పోలీస్ శాఖతో పాటు బాలల సంక్షేమ సమితి, కార్మిక, వైద్య, విద్యా శాఖాధికారులతో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు బాల కార్మికులను గుర్తించే పనిలో పడ్డారు.

ఈనెల 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ 31 వరకు కొనసాగుతుంది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో బాల కార్మికులు లేకుండా చేయాలనే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. 

పకడ్బందీ ప్రణాళికతో.. 

బాలకార్మికులను గుర్తించే విషయంలో అధికారుల పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. బాల కార్మికులు పనిచేసే స్పాట్స్ ని గుర్తించి టీమ్స్ తో వెళ్లి  రైడ్ చేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి చేయిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో రెస్క్యూ చేసిన పిల్లల పరిస్థితిని తెలుసుకుంటున్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలు గొర్రెల, పశువుల కాపరులుగా, కిరాణం, మెకానిక్ షాపుల్లో, హోటళ్లలో పనిచేసేవారు, రోడ్డుపై భిక్షాటన చేసేవారు, ఇటుక బట్టీల్లో, పౌల్ట్రీ ఫామ్ ల్లో, ఇతర ప్రదేశాల్లో తప్పిపోయిన, వదిలివేసినవారు పని చేస్తున్నట్టుగా గుర్తిస్తే  వారిని తల్లిదండ్రుల వద్దకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ విషయంలో తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి  అప్పగిస్తున్నారు లేదంటే స్టేట్ హోమ్ కు తరలిస్తున్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ తోపాటు నలుగురు సిబ్బందిని నియమిస్తున్నారు. బాల కార్మికులను గుర్తించిన వారు1098 లేదా 100 నెంబర్లకు డయల్​చేయాలని లేదా  సిద్దిపేట కమిషనరేట్ కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ 87126 67100, ఉమెన్ సేఫ్టీ వింగ్ హైదరాబాద్ 9440700906  ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

306 మందికి విముక్తి

సిద్దిపేట జిల్లా ఏర్పాటైన ఏడేండ్లలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు  306 మంది బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. గతేడాది 48 మంది బాలలకు విముక్తి కల్పించగా 2022 లో 51, 2021 లో 39 మందికి విముక్తి కల్పించారు. జూలై లో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ప్రారంభం కావడంతో సీపీ అనురాధ వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బాల కార్మికులతో పనిచేయించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. 

భారీగా వలస కార్మికులు

సిద్దిపేట జిల్లాలో ఇటీవల కాలంలో వలస కార్మికుల రాక పెరిగింది. ఇందులో బాలకార్మికులు కూడా ఉంటున్నారు. జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు, ఇటుక బట్టీలు, గృహ నిర్మాణ పనులు, హామాలీ పనుల కోసం ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్ గఢ్​, మధ్య ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల నుంచి వలస కార్మికులు కుటుంబాలతో సహా వస్తున్నారు. వీరిలో చాలా మంది కార్మికులు తమ పిల్లల్ని పనుల్లోకి దించుతున్నారు. అధికారుల తనిఖీల సందర్భంగా పిల్లలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఏడాది నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ లో జిల్లాలో బాల కార్మికులు లేకుండా చేయాలనే అధికారుల ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.