ఆశలన్నీ ఎన్ఆర్ఐ పాలసీ పైనే..

  •  
  • ఈ నెల17న కార్మిక సంఘాలతో రివ్యూ మీటింగ్  
  • పదేండ్లు నిర్లక్ష్యం చేసిన గత బీఆర్ఎస్ సర్కార్ 
  • ప్రస్తుత సీఎం నిర్ణయంతో బాధిత కుటుంబాల్లో ఆనందం  

నిర్మల్, వెలుగు:  గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పదేండ్లుగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుండగా ఎట్టకేలకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తామంటూ గత బీఆర్ఎస్ పాలకులు హామీలు ఇచ్చారు.  పార్టీ మేని ఫెస్టోల్లో సైతం అంశా న్ని చేర్చి గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు భరోసామని పేర్కొన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నా ఏనాడు పట్టించుకోలేదు. ఎన్ఆర్ఐ పాలసీ పై తీవ్ర నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చేపట్టాల్సిన ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తామంటూ కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఈనెల 17న సీఎం ప్రత్యేకంగా భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించకుంది. ఇప్పటికే నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాల్లో లక్షలాదిమంది గల్ఫ్ దేశాల్లో కార్మికులు కష్టాలు ఎదుర్కొంటున్నారు.  సీఎం రేవంత్ భేటీతో కార్మిక కుటుంబాల ఆశలన్నీ ఎన్ఆర్ఐ పాలసీపైనే ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో దాదాపు 25 వేల మందికి పైగా గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా పని చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వేతనాలతో తీవ్రమైన పని భారంతో శారీరకంగా, మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తే గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. 

గల్ఫ్ కార్మిక సంఘాల డిమాండ్లు ఇవే..

 రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించి.. సంక్షేమానికి రూ. 500 కోట్ల బడ్జెట్ ను కేటాయించాలి. మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా, అక్కడ జైళ్లలోని కార్మికులకు న్యాయ సహాయం అందించాలి.  సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ పథకం వర్తించేట్లు చూడాలి. ప్రవాసి యోగక్షేమ పథకం ప్రారంభించాలి.  మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు రిక్రూటింగ్ వ్యవస్థపై  పర్యవేక్షణ పెట్టి..  జిల్లా, మండల, గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలి. గల్ఫ్ చట్టాలపైనా అవేర్ నెస్ చేయాలి.  ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ఎన్ఆర్ఐ వింగ్ ఏర్పాటు చేసి..  ప్రతి ఏటా తెలంగాణ దివస్ ను అధికారికంగా నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుతో పాటు  హైదరాబాదులో సౌదీ ఎంబసీ, ఆన్ లైన్ ఓటింగ్ లేదా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

 ప్రత్యేక నిధులు కేటాయించాలి

గల్ఫ్ కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంతో కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్ఆర్ఐ పాలసీని రూపొందిస్తుందని ఆశిస్తున్నాయి. దీంతోనే కార్మికులకు భద్రత ఉంటుంది. ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. 
– షబ్బీర్ పాషా, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

ముఖ్యమంత్రి చొరవ అభినందనీయం 

గల్ఫ్  కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవడం అభినందనీయం. గత ఆరున్నరేండ్లలో గల్ఫ్ దేశాల్లో దాదాపు 1,300 మంది మన రాష్ట్ర కార్మికులు మరణించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.  24 గంటల హెల్ప్ లైన్ ను అందుబాటులో ఉంచాలి. ఈసీఆర్ (ఇమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్) పకడ్బందీగా అమలు చేయాలి. దీని పరిధిలోకి  సింగపూర్ ను కూడా చేర్చాలి. ధనవంతులైన ఎన్నారైలు రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహించాలి.           
– స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు