అడుగు దూరంలో ఆగిన ‘గౌరవెల్లి’..కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతన్నల ఆశలు

  • ఎన్జీటీ కేసుతో నిలిచిన ప్యాచ్ వర్క్  పనులు
  • కెనాల్ వర్క్స్​పై మంత్రి పొన్నం స్పెషల్  ఫోకస్

సిద్దిపేట, వెలుగు : హుస్నాబాద్‌‌ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్‌‌ ప్రారంభానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. తొంభై శాతం పనులు పూర్తయి ప్యాచ్‌‌వర్క్‌‌ మాత్రమే మిగిలి ఉండడంతో ఏడాది కింద ట్రయల్‌‌ రన్‌‌ సైతం నిర్వహించారు. కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా ప్రాజెక్ట్‌‌ ప్రారంభానికి నోచుకోలేదు. బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ పర్యావరణ అనుమతులు పొందకుండా పనులు చేపట్టడంతో కొందరు నేషనల్​గ్రీన్ ట్రిబ్యునల్​ను ఆశ్రయించారు.

గత ప్రభుత్వం ఎన్జీటీ ఆర్డర్లను పట్టించుకోకపోవడంతో ఎంజీఆర్బీ(గోదావరి రివర్ మేనేజ్​మెంట్​బోర్డు) ఆదేశాలతో ఏకంగా ప్రాజెక్టు ప్యాచ్ వర్క్ పనులు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఇది జరిగి ఏడాది కావస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని  రైతులు ఆశలు పెట్టుకున్నారు. దీంతో చిక్కుముళ్లను విప్పి ప్రాజెక్టును ప్రారంభించే ప్రయత్నాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రమిస్తున్నారు. 

ఎన్జీటీ క్లియరెన్స్ కీలకం

గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఎన్జీటీ క్లియరెన్స్ పైనే ఆధారపడి ఉంది. ప్రాజెక్టు రీ డిజైన్ విషయంలో పర్యావరణ అనుమతులు లేకపోవడంతో పాటు భూనిర్వాసితుల పరిహారాలు పెండింగ్​లో ఉండడం ప్రధాన అడ్డంకిగా మారుతోంది. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా ప్రాజెక్టు ప్రారంభించాలని భావించినా ఎన్జీటీ షాక్​ఇచ్చింది. ఎన్జీటీ నాలుగు ఆర్డర్లు ఇచ్చినా గత బీఆర్ఎస్​ సర్కారు పట్టించుకోక పోవడంతో ఏకంగా జీఆర్ఎంబీ(గోదావరి రివర్​మేనేజ్​మెంట్ ​బోర్డు) ఆధ్వర్యలో గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట దగ్గర 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి  ప్యాచ్ వర్క్ పనులు జరగకుండా చర్యలు చేపట్టింది.

ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి నిర్వాసితులకు దాదాపు పరిహారం ఇచ్చినా..ముంపు గ్రామాల్లోని ఇండ్ల స్ట్రక్చర్, ఖాళీ స్థలాలు, 18 ఏండ్లు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ముంపు గ్రామాల్లో యువతులకు ఇవ్వాల్సిన పరిహారాలు కొన్ని పెండింగ్​లో ఉన్నాయి. వీటితో పాటు ఎన్జీటీ కేసులు ఇప్పుడు ప్రారంభోత్సవానికి అడ్డంకిగా మారాయి. ఏడాదిగా దీనిపై ఒక్క అడుగు ముందుకు పడకపోగా, ప్రస్తుతం రిజర్వాయర్ లో ఒక టీఎంసీ నీరు నిల్వ వుంది.

పనులపై తీవ్ర ప్రభావం

ఎన్జీటీ ఆదేశాల వల్ల ప్రాజెక్టు ముగింపుకు సంబంధించి ప్యాచ్ వర్క్ పనులపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రాజెక్టు వద్ద కేవలం చిన్న చిన్న  ప్యాచ్ వర్క్స్​ మాత్రమే నిర్వహించాల్సి ఉన్నా ఎన్జీటీ వాటి నిర్వహణకు అనుమతివ్వలేదు.  కట్టపై గ్రీనరీ, బండ్ లెవలింగ్,  రిటైనింగ్ వాల్, బండ్ పైన కింద రోడ్డు, రెయిన్ వాటర్ డ్రైన్ పనులు ఏడాదిగా మిగిలిపోయాయి. జీఎంఆర్బీ ప్రాజెక్టును సునిశతంగా పరిశీలిస్తుండడంతో ప్యాచ్ వర్క్ పనులు చేయడానికి అవకాశం లేకుండా పోయింది.  

ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ఫోకస్

హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. ఎన్జీటీ కేసుల నేపథ్యంలో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఇబ్బంది ఏర్పడిన కెనాల్స్ నిర్మాణానికి అవసరమైన చర్యలపై అధికారులతో సమావేశాలు నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ 90 శాతం పనులు  పూర్తయినందున..మిగిలినవి పూర్తి కాకపోతే వానాకాలంలో డ్యాంకు ఇబ్బంది కలుగుతుందని, మిగిలిన పనులు పూర్తి చేసేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్​ను అనుమతి  కోరాలని అధికారులకు సూచించారు. 

ప్రాజెక్టుతో రైతులకు లబ్ధి చేకూర్చి పంట పొలాలకు త్వరగా సాగునీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణాలకు అక్కన్నపేట మండలంలో 132 ఎకరాలు, హుస్నాబాద్ మండలంలో 235 ఎకరాలు,  కోహెడ మండలంలో 304 ఎకరాల భూ సర్వే పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.

గౌరవెల్లి ప్రాజెక్టు రైట్ కెనాల్ 47 కిలోమీటర్లు, 14 కిలో మీటర్ల  లెఫ్ట్ మెయిన్ కెనాల్ తో  హుస్నాబాద్ నియోజకవర్గంలోని చెరువులకు సాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన పనులను మూడు కేటగిరీలుగా విభజించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. కోహెడ మెయిన్ కెనాల్ వైపు నేషనల్​హైవే నిర్మాణం జరుగుతున్నందున రోడ్డు క్రాస్ చేసే ప్రాంతాన్ని ముందస్తుగా నేషనల్ హైవే వారికి తెలియజేయాలని అధికారులకు సూచించారు. 

పుష్కరకాలంగా సాగుతున్న పనులు 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పుష్కర కాలంగా సాగుతూనే ఉన్నాయి. 2009లో 1.45 టీఎంసీల సామర్థ్యంతో  గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మించాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించి 1800 ఎకరాలను సేకరించి పనులు ప్రారంభించింది. 2015లో  కేసీఆర్ ప్రాజెక్టును రీ డిజైన్ చేసి దాని సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచి 3870 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. నిర్వాసితుల ఆందోళనలు, ఇతర కారణాలతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పుష్కర కాలంగా సాగుతూనే ఉన్నాయి.