హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి : సకినాల నారాయణ

 

  • సీఎం విగ్రహం ఏర్పాటు చేసి 9 రోజులపాటు శాంతిదీక్ష 
  • వినూత్న రీతిలో నిరసన

బెల్లంపల్లి, వెలుగు: పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రిమూవల్ హోంగార్డు, హోంగార్డ్స్ జేఏసీ మాజీ చైర్మన్ సకినాల నారాయణ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలో ఉన్న తన నివాసంలో గురువారం నుంచి 9 రోజులపాటు శాంతిదీక్ష చేపట్టారు. వినూత్న రీతిలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. పూజలు చేసి శాంతిదీక్షకు పూనుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 6న హోమ్ గార్డ్స్ 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు.

తొలగించిన హోంగార్డులందరినీ తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. చనిపోయిన హోంగార్డుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఉద్యోగ విరమణ పొందిన వారికి గుడ్ సర్వీస్ కింద రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు వర్తింప జేయాలని కోరారు. హోంగార్డుల సర్వీస్ కాలపరిమితిని 60 నుంచి 64 ఏండ్లకు పెంచాలన్నారు. తన దీక్ష ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.