వానకు దెబ్బతిన్న పత్తి

  • పులి సంచారంతో కూలీలు దొరక్క ఇబ్బందులు
  • వర్షంతో  తడిసిపోయిన పత్తి, కల్లాల్లో వరి కుప్పలు

ఆసిఫాబాద్, వెలుగు :  ఆసిఫాబాద్ జిల్లాలో ఫెయింజల్  తుఫాన్  పంటలకు  తీవ్ర నష్టాన్ని కలిగించింది.  జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం  కురిసిన వర్షాలకు పత్తి పంట పూర్తిగా తడిసిపోయింది.  పంట కు గిట్టుబాటు ధర లేక  ఇబ్బందులు పడుతున్న రైతులకు అకాల వర్షం మరింత కష్టాల్లోకి నెట్టింది. పులుల సంచారంతో పత్తి ఏరేందుకు కూలీలు రావడం లేదు. దీంతో చెట్లపైనే ఉన్న పత్తి పూర్తిగా వర్షానికి తడిసి పోయి , నల్లబారి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదని  రైతులు ఆందోళన చెందుతున్నారు. 

కల్లాల్లో అమ్ముకునేందుకు సిద్దంగా ఉన్న వడ్ల కుప్పలు అకాల వర్షాలకు తడిసిపోయే ప్రమాదం ఉందని  రైతులు భయపడుతున్నారు.   గత రెండు మూడు రోజులుగా జిల్లాలో  చినుకులు పడగా,  శుక్రవారం  ఆసిఫాబాద్ , రెబ్బెన,  వాంకిడి, కౌటల ,చింతలమానేపల్లి మండలాల్లో గంటపాటు వర్షం దంచికొట్టింది. వర్షానికి తేమ శాతం పెరిగే అవకాశం ఉందని రైతులు దిగులు చెందుతున్నారు. ఓ పక్క వర్షాలు మరో పక్క పులి భయంతో కూలీలు దొరక్క రైతులు  నష్టపోతున్నారు. 

వరిని ఆరబెట్టడం సమస్య

తుఫాను కారణంగా ఆకాశం  మబ్బు పట్టి  వారం రోజుల నుంచి   ఎండ రావడంలేదు.    వారం నుంచి ఆరబెడుతున్న  తేమ తగ్గలేదని , మరిన్ని రోజులు ఆరబెట్టాల్సివస్తుందని రైతులు చెపుతున్నారు. దీని వల్ల కూలీల భారం పెరుగుతుందని వాపోతున్నారు. వానలు, మబ్బులతో కంది పంట పూత రాలిపోతుందని, దిగుబడి వచ్చే పరిస్థితి లేదని  ఆందోళన చెందుతున్నారు.