చేర్యాల, వెలుగు : ‘సార్ మమ్మల్ని విడిచి పోవద్దు. మీరే మాకు ఎప్పుడూ పాఠాలు చెప్పాలె. మీరు లేకపోతే మేము బడికా రాం’ అంటూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఇక్కడ పని చేస్తున్న నలుగురు టీచర్లు బదిలీ కాగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారిని వదల్లేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ స్కూల్ లో 123 మంది చదువుతుండగా, ప్రభుత్వం టీచర్ల బదిలీల్లో భాగంగా ఉపాధ్యాయులు గొంటి బుచ్చయ్య, అక్కెనపల్లి ఇంద్రసేనా రెడ్డి, ఉప్పల భాస్కర్, తాటికొండ యాదయ్యకు ట్రాన్స్ఫర్ అయ్యింది.
విషయం తెలిసిన విద్యార్థులు బదిలీపై వెళ్తున్న టీచర్ల దగ్గరకు వచ్చి వెళ్లనివ్వలేదు. ‘సార్ ఎందుకు పోతున్నరు. మీ లెక్క సదువు చెప్పెటోళ్లు మల్లా వస్తరా..వెళ్లొద్దు సార్’ అంటూ వారిని పట్టుకుని రోదించారు. పిల్లలు చూపిస్తున్న ఆప్యాయతను, ప్రేమను చూసి టీచర్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు బడికి రాకపోతే ఇండ్లకు వచ్చి నచ్చచెప్పి తీసుకువెళ్లేవారని, మధ్యాహ్న భోజన విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారని, ఆట పాటల్లో ప్రోత్సహించేవారన్నారు.
నవోదయ, మోడల్ స్కూల్ పరీక్షలకు ప్రిపేర్ చేయించేవారని, స్కూల్ టైం అయిపోయినా పాఠాలు చెప్పేవారన్నారు. నోట్ పుస్తకాలు, పెన్నులు లేకపోతే కొని పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. చివరకు నలుగురు టీచర్లను సన్మానించి బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలికారు.