మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్, పారుపల్లి (పలుగుల) రీచ్‌ల నుంచి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నామని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) మంచిర్యాల ప్రాజెక్టు ఆఫీసర్ తారక్‌నాథ్‌రెడ్డి వెల్లడించారు. ‘ఇసుక దందాలో హస్తం.. కోటపల్లి మండలంలో గోదావరి నుంచి జోరుగా రవాణా.. శాండ్ మాఫియా వెనుక కాంగ్రెస్ లీడర్లు’ అంటూ శనివారం ఓ దిన పత్రికలో పబ్లిష్ అయిన కథనం నిరాధారమని, సత్య దూరమని స్పష్టం చేశారు.
గోదావరి నుంచి ఇసుకను తీసి స్టాక్ యార్డుకు తరలించడానికి, ఆన్లైన్ బుకింగ్ ప్రకారం లారీల్లో లోడింగ్ చేయడం వంటి పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించామని తెలిపారు. ఇసుక రవాణా కోసం టీజీఎండీసీ పటిష్టమైన సెంట్రలైజ్డ్ ఆన్లైన్ సిస్టమ్‌తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. కస్టమర్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న క్వాంటిటీ మేరకే స్టాక్ యార్డుల్లో లోడింగ్ చేస్తున్నామని, లారీలను కాంటా వేసి ఎక్కువ క్వాంటిటీ ఉన్నట్లు తేలితే ఆ మేరకు ఇసుకను అక్కడే తొలగిస్తున్నామని తారక్‌నాథ్‌రెడ్డి వివరించారు.
ఇసుక లారీలు వే బిల్స్ లేకుండా రీచ్‌ల నుంచి బయటకు వెళ్లే అవకాశం లేదన్నారు. రీచ్‌లలో నిరంతరం టీజీఎండీసీ, మైనింగ్ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని.. స్పెషల్ టీమ్స్ ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తాయని తెలిపారు. శుక్రవారం పట్టుబడిన నాలుగు లారీలు కూడా సరైన వేబిల్స్తోనే వెళ్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.