న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ కంపెనీ తదిరాన్ టెలికం.. ఐపీ టెలిఫోన్లను తయారు చేయడానికి ఏటా కనీసం10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 80 కోట్లు) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఐపీ టెలిఫోన్లు యాప్‌ల ద్వారా కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకోవచ్చు. వీటిని ఎక్కువ వ్యాపార సంస్థలలో వాడుతారు. ఫోన్ల తయారీకి కంపెనీ డీసీఎం శ్రీరామ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తదిరాన్ టెలికాం సీఈఓ మోషే మిట్జ్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్ష ఐపీ టెలిఫోన్లను తయారు చేయాలని భావిస్తున్నామని, ఈ ప్రాజెక్ట్ కోసం ఒక సంవత్సరానికి 10 మిలియన్ డాలర్లు కేటాయిస్తామని వివరించారు. పనితీరు ఆధారంగా పెట్టుబడి పెరగవచ్చని మిట్జ్ చెప్పారు. తదిరన్ ఛానెల్ పార్ట్నర్స్ ద్వారా గత 26 సంవత్సరాలుగా భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీ వ్యాపారంలో 70 శాతం సాఫ్ట్‌వేర్ నుంచి, 30 శాతం హార్డ్‌వేర్ నుంచి వస్తున్నట్లు మిట్జ్ తెలిపారు.