కొమురెల్లిలో హుండీల లోగుట్టు మల్లన్నకెరుక?

  • లెక్కింపు సందర్భంగా మాయమై చెత్తకుప్పలో దొరికిన గొలుసు..కనిపించని ఉంగరం  
  • ఎనిమిది కెమెరాలకు ఉన్నవి నాలుగే..
  • నాలుగింటిలో ఏడాదిగారెండు కెమెరాలు పని చేస్తలేవ్​
  • సరైన దిశలో లేని మరో కెమెరా   
  • అధికారుల నిర్లక్ష్యం, పాత్రపై అనుమానాలు 

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా పారదర్శకత విషయంలో అధికారుల తీరు అనుమానాలకు తావిస్తున్నది. స్వామికి భక్తులు సమర్పించే కానుకలను లెక్కించే చోట సీసీ  కెమెరాలు పనిచేయకపోవడంతో అక్కడేం జరుగుతుందన్నది తెలియడం లేదు. మంగళవారం లెక్కింపు సందర్భంగా హుండీల నుంచి తీసిన బంగారాన్ని ఏఈవో, ఈవో టేబుల్స్​పై డబ్బాల్లో పెట్టి భోజనానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఒక డబ్బాలోని ఐదు గ్రాముల బంగారు గొలుసు, ఐదు గ్రాముల బంగారు ఉంగరం కనిపించలేదు.

దీంతో పోలీసులు వచ్చి వెతుకుతుండడంతో చేతివాటాన్ని ప్రదర్శించిన వ్యక్తి గొలుసును చెత్తకుప్పలో వేసి తప్పుకున్నాడు. కానీ, మరో ఐదు గ్రాముల ఉంగరం మాత్రం దొరకలేదు. సీసీ కెమెరాల్లో వెతికి నిందితుడిని పట్టుకుందామంటే మంగళవారం ఆపరేటర్ ​రాలేదు. బుధవారం వచ్చాక చెక్​ చేయగా, నాలుగు కెమెరాల్లో రెండు కెమెరాలు పని చేయడం లేదని తెలిసింది.

ఆరా తీయగా దాదాపు ఏడాది నుంచి వర్కింగ్​ కండీషన్​లో లేదన్న విషయం వెల్లడైంది. దాదాపు 12 నెలల నుంచి రెండు సీసీ కెమె రాలు పని చేయకున్నా అలాగే హుండీ లెక్కింపును కొనసాగించడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరో రెండు సీసీ కెమెరాలు పని చేస్తున్నా అందులో ఒక కెమెరా  దిశను వేరే వైపుకు మార్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అన్నది తేలాల్సి ఉన్నది. ఇది కూడా లాంగ్​షాట్​లో విజువల్స్​ చూపించేది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఉంగరం సంగతి మిస్టరీగా మారింది.  

ఆభరణాల నమోదు..అంతా రివర్స్​ 

మల్లన్న హుండీలో భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాల కానుకలను రిజిస్టర్​లో నమోదు చేసే విషయంలో స్పష్టత కరువవుతోంది. హుండీలో వేసిన అభరణాలను రిజిస్టర్​లో నమోదు చేసిన తర్వాత కంసాలి ఆభరణాల విలువ, బరువును నిర్ధారించాలి. కానీ, ఇక్కడ మాత్రం ఇలా జరగడం లేదు. కంసాలి మొత్తం నిర్ధారణ జరిపిన తర్వాతే అధికారులు రిజిస్టర్​లో నమోదు చేస్తుండటం చేతివాటానికి అవకాశం కల్పిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు గత ఏడాది కాలంగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అనేక అంశాలు వెలుగులోకి రాకుండా మరుగునపడిపోయాయనే అనుమానాలు వస్తున్నాయి.

నిబంధనల అమలేది..? 

మల్లన్న ఆలయ హుండీ  లెక్కింపు సందర్బంగా నిబంధనల అమలు విషయంలో అధికారులు 
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హుండీ లెక్కింపు ప్రాంతానికి ఎవరిని పడితే వారిని రానిస్తున్నారు. వారి రాకపోకలను నియంత్రించే వారు కరువయ్యారు. అలాగే డ్రెస్ కోడ్ అమలు, లెక్కించే వారు బంగారు ఆభరణాలు ధరించరాదనే నిబంధన కూడా అమలుపరచడం లేదు. ఆలయ ధర్మకర్తలతో పాటు సిబ్బంది, అధికారులు సైతం ఇవే నిబంధనలు పాటించాల్సి ఉన్నా అవేవీ ఇక్కడ కనిపించవు.  

24 హుండీలు...రెండు సీసీ కెమెరాలు..

మల్లన్న ఆలయ పరిధిలోని 24 హుండీలను ఆలయ ముఖమండపంలో లెక్కిస్తారు. లెక్కింపు జరిగే ప్రదేశంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిజానికి ముఖ మండపంలో ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో నాలుగే ఏర్పాటు చేయడం, రెండు పని చేయకపోవడం, మరో రెండు పని చేసినా ఒకటి సరైన దిశలో అమర్చకపోవడంతో హుండీల లెక్కింపు జరిగినప్పుడల్లా ఆభరణాలు చోరీకి గురవుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి.

రోజూ వేల మంది భక్తులు మల్లన్నను దర్శించుకుని తాము కోరిన కోరికలు తీర్చినందుకు తృణమో..ఫణమో సమర్పించుకుంటారు. ఇందులో బంగారు, వెండి, ఇతర ఆభరణాలతో పాటు నగదు కూడా ఉంటుంది. ఇదంతా పారదర్శకంగా లెక్కించేలా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  

ఏఈవో ను సస్పెండ్ చేయాలి

హుండీ లెక్కింపులో మంగళవారం బంగారం మాయమైన ఘటనలో ఏఈవో గంగ శ్రీనివాస్ పాత్ర ఉంది. ఆయనను సస్పెండ్ చేయాలి. ఏఈవో టేబుల్ దగ్గర ఉన్న టైంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అతడిపై పీఎస్​లో రెండు కేసులు నమోదయ్యాయి. ఆయనకు ఈవో బాలాజీ కూడా సహకరిస్తున్నారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రితో పాటు కమీషనర్ కు ఫిర్యాదు చేస్తాం. శ్రీనివాస్ గతంలో బాసర ఆలయంలో అవినీతికి పాల్పడి సస్పెండ్ అయ్యాడు. మళ్లీ పైరవీ చేసి కొమురవెల్లికి వచ్చాడు. ఆలయ కాంట్రాక్టర్ల ను బెదిరిస్తూ కమిషన్లు వసూలు చేస్తున్నాడు. ఈవో ముందే తోటి ఉద్యోగిపై దాడి చేశాడు. జాతర టైంలో వీవీఐపీ పాస్​లను అమ్ముకొని పట్టుబడ్డాడు.  

శెట్టిపల్లి సత్తిరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి