- వేరే మహిళతో ఉంటున్నాడని పీఎస్ ఎదుట భార్య ఆందోళన
- విచారణ జరిపి సస్పెండ్ చేసిన ఐజీ
- ముస్తాబాద్ కానిస్టేబుల్శ్రీనివాస్ కూడా...
కొమురవెల్లి, వెలుగు: భార్యకు విడాకులివ్వకుండా మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొమురవెల్లి ఎస్ఐ నాగరాజును మల్టీ జోన్– 1 ఐజీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తన భర్త తనకు చెప్పకుండా రెండో పెండ్లి చేసుకున్నాడని, పిల్లలను తన నుంచి దూరం చేసి విడాకులివ్వాలని ఒత్తిడి చేస్తున్నాడంటూ కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు భార్య మానస, బంధువులతో కలిసి మంగళవారం కొమురవెల్లి పోలీస్స్టేషన్ఎదుట ఆందోళనకు దిగింది.
ఈ ఘటన గురించి తెలుసుకున్న సిద్దిపేట సీపీ విచారణ జరపగా ఆరోపణలు నిజమేనని తేలాయి. దీంతో పోలీసు శాఖ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఎస్ఐ నాగరాజు వ్యవహరించాడని, అతడిని సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ –1 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పి. శ్రీనివాస్ కు కూడా భార్య ఉండగా, మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు గుర్తించి సస్పెండ్ చేశారు.