సిద్దిపేటలో కుంటలు కనుమరుగు

  • అక్రమార్కుల చేతుల్లోకి విలువైన భూములు
  • హద్దుల నిర్ధారణపై అధికారుల నిర్లక్ష్యం
  • సిడ్రా ఏర్పాటుకు పెరుగుతున్న డిమాండ్

సిద్దిపేట, వెలుగు: ప్రజల నీటి అవసరాలను తీర్చడం కోసం సిద్దిపేట పట్టణంలో దశాబ్దాల కింద నిర్మించిన కుంటలు అనేకం కనుమరుగయ్యాయి. గ్రామ పరిధిలో 50 కి పైగా కుంటలు ఉండగా వాటిలో 15 కుంటలు రికార్డుల్లో కనిపించడం లేదు. మిగిలిన కుంటలు పాక్షికంగా కబ్జాలకు గురయ్యాయి. పట్టణ శివార్లలో 72 ఎకరాల్లో 8 చిన్న కుంటలు ఉండగా నేడు అవి పూర్తిగా కనుమరుగయ్యాయి.

రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవడంతో కుంటలు అన్యాక్రాంతమైనా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. రెండు దశాబ్దాల కింద తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కుంటల్లోకి నీరు చేరకపోవడాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వాటిని ఆక్రమించి అమ్ముకున్నారు. ఇదిలా ఉంటే కొన్ని నీరు లేని కుంటల్లో ప్రభుత్వ భవనాలను సైతం నిర్మించారు.  

విలువైన భూముల ఆక్రమణ

రెండు దశాబ్దాల కింద సిద్దిపేట పట్టణం చుట్టు ప్రశాంత్ నగర్, హన్మాన్ నగర్, లింగారెడ్డిపల్లి, నర్సాపూర్, రంగథాంపల్లి గ్రామాల పరిధిలో నీటి కుంటలను నిర్మించారు. తర్వాత ఆ గ్రామాలు సిద్దిపేట మున్సిపాల్టీలో విలీనం కావడంతో అక్రమార్కులు కుంటల్లోకి నీళ్లు వెళ్లకుండా చేసి క్రమంగా కనుమరగయ్యేలా చేశారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం సిద్దిపేట రెవెన్యూ గ్రామ పరిధిలో నీటి పారుదల శాఖకు చెందిన 4 చెరువులు, పంచాయతీ రాజ్ ఆధీనంలో 40 కుంటలు ఉండేవి.

పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని నుకసాని కుంట, అంబయ్య కుంట, చేపల కుంట, మామిడి కుంటల్లోని శిఖం భూములకు రెవెన్యూ అధికారులు చట్టవిరుద్ధంగా పట్టాలు ఇవ్వడంతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. డిగ్రీ కాలేజ్​వెనుక వైపు ఉన్న పది ఎకరాల్లోని ఆరెవాని కుంట, మంగలివాని కుంట ఆనవాళ్లే లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ ప్రదేశమంతా ఇండ్లతో నిండిపోయింది.

 నూకసాని కుంటలో రైతు బజార్ ఏర్పాటు చేయగా అందులో కొంత భాగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపొయింది. శ్రీరామ కుంటలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయగా అందులో కొంత ఆక్రమణకు గురవగా, గణపతి కుంటలో కట్ట మినహా మిగిలింది ఆక్రమణకు గురైంది. మచ్చవాని కుంట, కానుగు కుంట, కటికవాని కుంట,చిలువేరువాని కుంట,అవుసుల వాని కుంట,అమీన్ కుంట, ఎలుపుకుంట, ఉప్పరకుంట, ఎల్లమ్మ కుంటలు చాలా వరకు కబ్జాలకు గురయ్యాయి.

నాసర్ పురా వద్ద గల 2194 సర్వే నెంబరులోని కప్పలకుంట3.19 ఎకరాలుండగా వాటిలో రెండు ఎకరాలు ఆక్రమణకు గురవగా ప్రస్తుతం రోడ్డు వైపు ఉన్న కొంత భాగాన్ని ఆక్రమించడానికి మట్టితో నింపుతున్నారు. నర్సాపూర్ ఊర చెరువు ఎఫ్టీఎల్ భాగంలో మట్టితో నింపుతూ ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

హై కోర్టు ఆదేశాలతో సర్వే

రెండు దశాబ్దాల కింద కుంటలు, చెరువులు అన్యాక్రాంతమవడంపై న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పట్టణ శివార్లలోని 72 ఎకరాల్లో విస్తరించిన 6 కుంటలపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక సర్వే నిర్వహించి హై కోర్టుకు నివేదికను సమర్పించారు. పట్టణ శివార్లలోని కప్పల కుంట, మామిడి కుంట, మచ్చవాని కుంట, ఆరెవాని కుంట, శంకరయ్య కుంట, నర్సాపురం ఊర చెరువుల కింద 600 ఎకరాల ఆయకట్టు ఉండేది. హై కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే నిర్వహించి నివేదిక సమర్పించిన తర్వాత  వాటి  రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో  ప్రస్తుతం పది ఎకరాలలోపే వాటి విస్తీర్ణం మిగిలి ఉంది.