గవర్నమెంట్ స్కూళ్ల స్టూడెంట్లకు మళ్లీ విహారయాత్రలు

  • గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని పేరిట టూర్లు
  • నిర్మల్​ జిల్లాలో కొయ్య బొమ్మలు, కోటలతోపాటు బాసరకు పెరగనున్న ఆదరణ
  • కడెం, కవ్వాల్​కు గుర్తింపు

నిర్మల్‌, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో చాలా ఏండ్ల క్రితం నిలిపివేసిన స్టూడెంట్స్ ఎక్స్​కర్షన్ ప్రోగ్రాం మళ్లీ మొదలుకాబోతోంది. స్థానికంగా ఉన్న పర్యాటక, సాంస్కృతిక, చారిత్రక ప్రాంతాలపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దర్శిని పేరిట ఓ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. 

పర్యాటక ప్రాంతాలపై అవగాహన

గతంలో జరిగిన పలు సంఘటనల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అధికారికంగా ఎక్స్​కర్షన్లను నిలిపివేశారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు స్థానిక పర్యాటక రంగంపై, సమీప జిల్లాల్లోని పర్యాటక స్థలాలపై కనీస అవగాహన లేకపోవడం, వారికి మానసిక ఉల్లాసాన్నిచ్చే కార్యక్రమాలు చేపట్టకపోతుండడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది.

దీంతో విద్యార్థులకు చారిత్రక పర్యాటక ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధిగాంచిన స్థలాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ దర్శిని కార్యక్రమం చేపట్టనున్నారు. సెలవు దినాల్లో తరగతుల వారీగా విద్యార్థులను ఎక్స్ కర్షన్లకు తీసుకెళ్లనున్నాయి. అయితే గతంలో ఈ ఎక్స్​కర్షన్ల  ఖర్చును విద్యార్థులే భరించేవారు. ఈసారి మాత్రం తెలంగాణ దర్శిని ద్వారా ఖర్చును ప్రభుత్వమే ఇవ్వనుంది.

లోకల్ టూరిస్ట్ ప్లేస్​లకు మహర్దశ

తెలంగాణ దర్శిని కార్యక్రమంతో లోకల్ టూరిస్ట్ ప్లేస్​లకు మరింత ఆదరణ పెరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతంతో పాటు కవ్వాల్ అభయా రణ్యం, కడెం ప్రాజెక్ట్, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, బాసర సరస్వతి దేవి ఆలయం, నిర్మల్ కొయ్య బొమ్మల కేంద్రం లాంటి ప్రదేశాలకు స్టూడెంట్ల తాకిడి పెరగనుంది.

నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గండి రామన్న అర్బన్ పార్క్, సాయిబాబా ఆలయం, కదిలి పాపహరేశ్వర ఆలయంతోపాటు పలు చారిత్రక ఆలయాలు, గాజులపేటలోని చర్చి వంటి ప్రదేశాలను విద్యార్థులు సందర్శించే అవకాశాలున్నాయి. చారిత్రక భత్తీస్​ఘడ్, శ్యామ్ ఘడ్ కోటలకు ఆదరణ పెరగనుంది. ఫలితంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.