ఏండ్లుగా కిరాయి బిల్డింగ్ ల్లోనే..మెదక్లో హాస్టళ్లకు సొంత బిల్డింగ్ లు లేవు

  • అరకొర వసతులతో స్టూడెంట్స్​కు ఇబ్బందులు

మెదక్, వెలుగు: విద్యాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చామని గత బీఆర్ఎస్​ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కొత్తగా అనేక రెసిడెన్షియల్​స్కూల్స్​మంజూరు చేసింది. కానీ ఇదివరకు ఉన్న హాస్టళ్లకు​మాత్రం బిల్డింగ్​లు నిర్మించలేదు. దీంతో ఏండ్ల తరబడిగా పలు హాస్టళ్ల స్టూడెంట్స్​అరకొర వసతులతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. జిల్లాలో మొత్తం 23 వెనుకబడిన తరగతుల (బీసీ) హాస్టల్స్​ఉన్నాయి. వాటిలో 7 హాస్టల్స్​కు సొంత బిల్డింగ్​లు లేవు. ఇందులో నాలుగు కాలేజ్​హాస్టల్స్​కాగా, మూడు ప్రీ మెట్రిక్​ హాస్టల్స్. మెదక్ మండల సర్ధన బాయ్స్​ హాస్టల్​, మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని గర్ల్స్​హాస్టల్, మండల కేంద్రమైన పెద్ద శంకరంపేటలోని గర్ల్స్​హాస్టల్​కు సొంత బిల్డింగ్​లు లేవు. 

దీంతో అద్దె భవనాల్లో వాటిని ఏర్పాటు చేశారు. ఒక్కో హాస్టల్​లో 100 మంది వరకు స్టూడెంట్స్ ఉండగా ఆయా బిల్డింగ్ లలో హాస్టల్​ నిర్వహణకు, స్టూడెంట్స్​సంఖ్యకు అనుగుణంగా వసతి సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్టూడెంట్స్​పడుకునేందుకు, డైనింగ్​హాల్, స్టోర్, కిచెన్, వార్డన్​కు సరిపడ గదులు లేక సమస్యలతో సతమతమవుతున్నారు. దశాబ్దాల తరబడిగా ఆయా హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నా సొంత భవనాలు మాత్రం నిర్మించడం లేదు.   

కాలేజ్​ హాస్టల్స్ పరిస్థితి ఇంతే.. 

గత ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు బీసీ కాలేజ్​ హాస్టల్స్​మంజూరు చేసింది. ఇందులో భాగంగా మెదక్​లో ఒక బాయ్స్​, ఒక గర్ల్స్​ హాస్టల్​, నర్సాపూర్​ లో ఒక బాయ్స్​, ఒక గర్ల్స్​ హాస్టల్​ మంజూరయ్యాయి. ఆయా చోట్ల గర్ల్స్​ హాస్టల్స్​ 2008లో మంజూరు కాగా, బాయ్స్​ హాస్టల్స్​ 2011లో  మంజూరయ్యాయి. ఒక్కో కాలేజ్​ హాస్టల్​లో 150 మంది స్టూడెంట్స్​ ఉన్నారు. ప్రతి సెగ్మెంట్​ కు రెండు కాలేజ్​ హాస్టల్స్​ మంజూరు చేయడం బాగానే ఉన్నా గత ప్రభుత్వం వాటికి సొంత బిల్డింగ్​ లు మంజూరు చేయలేదు. దీంతో ఏండ్ల తరబడిగా అవి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆ భవనాల్లో స్టూడెంట్స్​సంఖ్యకు అనుగుణంగా వసతి సదుపాయాలు లేక పోవడంతో అరకొర వసతులతో అవస్థలు పడుతున్నారు. 

స్థలాలు దొరకితే బిల్డింగ్​ల మంజూరు 

జిల్లాలో నాలుగు కాలేజీ హాస్టల్స్​, మూడు ప్రీ మెట్రిక్​ హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఉన్నంతలో స్టూడెంట్స్​కు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఆయా చోట్ల అనువైన ప్రభుత్వ స్థలాలు సేకరిస్తే సొంత బిల్డింగ్​ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి  నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. 
– నాగరాజు గౌడ్, డీబీసీడబ్ల్యువో