హాస్టల్‌‌‌‌లో అనుమానాస్పద స్థితిలో స్టూడెంట్‌‌‌‌ మృతి

  • గుర్తు తెలియని వ్యక్తులు చితకబాది, విషం తాగించారని కుటుంబసభ్యుల ఆరోపణ
  • ధర్నాకు దిగిన బంధువులు, విద్యార్థి సంఘాల లీడర్లు

ఆదిలాబాద్, వెలుగు : హాస్టల్‌‌‌‌లో ఉంటూ బీఎస్సీ చదువుతున్న ఓ స్టూడెంట్‌‌‌‌ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు చితకబాది, విషం తాగించడం వల్లే చనిపోయాడంటూ స్టూడెంట్‌‌‌‌ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నార్నూర్‌‌‌‌ మండలంలోని చోర్‌‌‌‌గావ్‌‌‌‌కు చెందిన ధన్వాన్‌‌‌‌ రాథోడ్, మీరాబాయి దంపతుల కుమారుడు జితేందర్‌‌‌‌ (18) రిమ్స్‌‌‌‌ నర్సింగ్‌‌‌‌ కాలేజీలో బీఎస్సీ ఫస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ చదువుతూ పిట్టలవాడలోని ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్‌‌‌‌ మెట్రిక్‌‌‌‌ హాస్టల్‌‌‌‌లో ఉంటున్నాడు. 

శుక్రవారం రాత్రి హాస్టల్‌‌‌‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌‌‌‌ పైనుంచి యువకుడు తన ఫ్రెండ్స్‌‌‌‌, బంధువులకు ఫోన్‌‌‌‌ చేశాడు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తనను నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌‌‌‌పైకి తీసుకొచ్చి చితకబాది, మద్యంలో విషం కలిపి తాగించారని చెప్పాడు. దీంతో జితేందర్‌‌‌‌ ఫ్రెండ్స్‌‌‌‌ వచ్చి అతడిని రిమ్స్‌‌‌‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ఆదిలాబాద్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించగా అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. 

కుటుంబ సభ్యులు,విద్యార్థి సంఘాల ధర్నా

జితేందర్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీని అంబులెన్స్‌‌‌‌లో ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. బలవంతంగా అంబులెన్స్‌‌‌‌లో ఎక్కించినప్పటికీ వాహనం కదలకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం డెడ్‌‌‌‌బాడీతో బస్టాండ్‌‌‌‌ వద్దకు చేరుకొనికుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. జితేందర్‌‌‌‌పై దాడి చేసిన నలుగురు వ్యక్తులు తమ గ్రామం వారే అయి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

 నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఆదిలాబాద్‌‌‌‌ డీఎస్పీ జీవన్‌‌‌‌రెడ్డి, ఆర్డీవో వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌, వన్‌‌‌‌టౌన్‌‌‌‌, టూటౌన్‌‌‌‌ సీఐలు సునీల్‌‌‌‌కుమార్, కరుణాకర్‌‌‌‌రావు ఘటనాస్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడినా వారు ఆందోళన విరమించలేదు. చివరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మృతుడి సోదరుడు అజయ్‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్‌‌‌‌ తెలిపారు.