భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ ఎంత పెరిగిందంటే..

సోమవారం ( నవంబర్ 25, 2024 ) దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిస్థితులు, మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించటం.. వంటి అంశాల ప్రభావంతో.. సూచీల్లో  పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 1076 పాయింట్లు పెరిగి 80, 251 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే..  397.5 పాయింట్లు పెరిగి 24,305  వద్ద ట్రేడ్ అవుతోంది.

సెన్సెక్స్ 30 లోని లార్సెన్, ఎమ్ అండ్ ఎమ్, ఎస్బీఐ, రిలయన్స్, ఐసీఐసీఐ వంటి షేర్లు లాభాలతో ప్రారంభం కాగా... జేఎస్ డబ్ల్యూ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.35 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన అదానీ కేసు ప్రభావంతో నష్టపోయిన అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభయ్యింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని పార్టీల సంకీర్ణ విజయం, ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు సహా పలు అంశాల ప్రభావంతో దేశీయ సూచీలు ఇవాళ ( నవంబర్ 25, 2024 ) లాభాలతో ప్రారంభమయ్యాయి.