సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందిస్తాం : అన్వేష్​ రెడ్డి

ఆదిలాబాద్, వెలుగు: వచ్చే ఏడాది రబీ సీజన్​నుంచి రైతులందరికీ శనగ, పిల్లి పెసర, వేరుశనగ, పత్తి,కంది, వరి విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్​ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన పదేండ్లలో రైతుబంధు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీని దూరం చేసిందని, విత్తన రేట్లను అమాంతంగా పెంచిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విత్తనాలను సబ్సిడీపై అందించిందని, ఇప్పుడు మళ్లీ సబ్సిడీ విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 సహకార సంఘాల ద్వారా ఈ సబ్సిడీ విత్తనాలను అందించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ఏ విత్తనాలు వాడాలి, వాటికి ఎంత సబ్సిడీ ఉంటుందనే విషయాలపై ముందుగానే అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వాటిని నమ్మొద్దన్నారు. రుణమాఫీ కాని వివరాలను సర్వే చేసేందుకు సీఏం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని, రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.