- బెస్ట్ పీహెచ్సీలో సేవలు తగ్గడంపై అరా
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్ శనివారం అర్ధరాత్రి కౌటాల పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. డీఎంహెచ్ఓ తుకారాం భట్‌తో కలిసి రాత్రి 12 గంటల సమయంలో పీహెచ్‌సీకి చేరుకున్నారు. ఇటీవల కౌటాల పీహెచ్సీ గురించి ‘వెలుగు’ డైలీలో ‘నాడు బెస్ట్ పీహెచ్సీ.. నేడు డాక్టర్లు లేని దుస్థితి’ పేరిట కథనం రావడంతో ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సీరియస్ గా తీసుకున్నారు. ఇందుకు కారణాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాల మేరకు హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ విజిట్ చేశారు.
పీహెచ్ సీలోని డెలివరీ రూమ్, సాధారణ పేషెంట్ల వార్డు, మందుల గదిని పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీహెచ్ సీలో పనిచేసే ఒక్క స్టాఫ్ నర్స్ రిలీవ్ అయిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని, అందుకు తగ్గట్లు పనిచేయాలన్నారు. ఆసుపత్రులకు వచ్చే వారితో మర్యాదగా మెలగాలన్నారు. డాక్లర్లు, సిబ్బందిని నియమించేందుకు కృషి చేస్తానన్నారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
కోల్‌బెల్ట్, వెలుగు: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని డీహెచ్ రవీందర్ నాయక్ అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్ రాజ్‌తో కలిసి ఆదివారం నస్పూర్ పీహెచ్ సీని సందర్శించారు. వైద్య సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న నేపథ్యంలో డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించి ఉత్తమ సేవలందించాలని పేర్కొన్నారు. ప్రజ లతో సత్సంబంధాలు పెంచుకోవాలని, ప్రభావిత ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.