లోయర్ మానేరు రిజర్వాయర్ లో .. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్

త్వరలో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సన్నాహాలు
ఇప్పటికే ప్రతిపాదిత డీపీఆర్ సిద్ధం చేసిన సింగరేణి 
రెండేళ్ల కిందటి ప్రతిపాదనలు మరోసారి తెరపైకి..
భూసేకరణ, ఇంధన సమస్య లేకుండా విద్యుత్ ఉత్పత్తి

కరీంనగర్, వెలుగు : లోయర్ మానేరు రిజర్వాయర్ లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తోంది. మూడేండ్ల కిందటే ప్రయత్నాలు జరిగినా.. అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలను అటకెక్కించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా భూసేకరణ, ఇంధన అవసరం లేకుండానే విద్యుదుత్పత్తి చేసే అవకాశా లను అన్వేషిస్తోంది.

 దీంతో తాజాగా మరోసారి లోయర్ మానేర్ డ్యామ్ లో సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ పై కదలిక వచ్చింది. మొత్తం రిజర్వాయర్ 81 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, ఇందులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్లాంటు ఏర్పాటుకు సింగరేణి డీపీఆర్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో 300 మెగావాట్ల(డీసీ) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేస్తారు. అంటే రిజర్వాయర్ లో 10 శాతం మేర సోలార్ ప్యానెల్స్ నిండిపోతాయి. ఇది నిర్మాణమైతే దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ గానూ రికార్డులకెక్కనుంది. 

మూడేళ్ల కిందటే పూర్తయిన సర్వే

ప్లాంట్ నిర్మాణానికి 2021 ఆగస్టులోనే టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌, టీయూవీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, టీయూవీ ఎస్‌యూడీ సౌత్‌ ఏషియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ , జెన్సాల్‌ ఇంజినీరింగ్‌, ఎస్‌జీయూఆర్‌ఆర్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి తదితర మేనేజ్‌మెంట్‌కన్సల్టెన్సీ ల ప్రతినిధులతో సింగరేణి ఆఫీసర్లు  సమావేశమై చర్చించారు. అదే ఏడాది అక్టోబర్ లో ఓ ప్రైవేట్ ఏజెన్సీ లోయర్ మానేరు డ్యామ్ లో సర్వే చేపట్టింది.

 రిజర్వాయర్ లో నీటి పరిమాణం, వేగం వంటి అంశాలను పరిశీలించే హైడ్రోగ్రాఫిక్‌, నీటి కింద భూమి పొరల స్థితిగతులను స్టడీ చేసే బెడ్‌ సాయిల్‌, నీటి అడుగు భాగంలోని నేల ఎత్తు పల్లాలను పరిశీలించే బ్యాతిమెట్రిక్‌ వంటి సర్వేలను నిర్వహించింది. వీటి ఆధారంగా ప్లాంట్‌ను డ్యామ్ లోని నీటిపై ఏ ప్రదేశంలో, ఏయే కొలతలతో ఏర్పాటు చేయాలనే విషయాలపై  నిర్ధారణకు వచ్చారు. డ్యామ్ లో మినిమం వాటర్ లెవల్స్ మెయింటెన్ చేసినప్పుడు కూడా సోలార్ ప్యానెల్స్ నీళ్లలో ఉండేలా డీపీఆర్ డిజైన్ చేసినట్లు
 తెలిసింది. 

మత్స్య సంపదకు ముప్పు లేదు..

సోలార్ పవర్ ప్లాంట్లతో మత్స్య సంపదకు ముప్పు ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే చాన్స్ ఉండదనే అనుమానాలు ఉన్నాయి. అయితే నీటిపై సోలార్ ప్యానెళ్లు కప్పి ఉంచడం వల్ల నాచు పెరగదని, దీంతో నీరు పరిశు భ్రంగా ఉండి ఆక్సిజన్ లెవల్స్ పెరిగి చేపలు ఎదిగేందుకు దోహదపడుతుందని పలు పరిశోధనల్లో తేలింది. రిజర్వా యర్ నీటిలో10 శాతం విస్తీర్ణంలో మాత్రమే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి మత్స్యకారుల చేపల వేటకు ఇబ్బందులు రావని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. 

300 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణానికి సుమారు 3 వేల కోట్లలోపు ఖర్చు అవుతుందని సింగరేణి ఆఫీసర్లు అంచనా వేసినట్లు తెలిసింది. కాగా.. ఇందుకు భూసేకరణ, పరిహారం చెల్లింపు, ఇతర ఇంధనాల వాడకం వంటి సమస్యలు లేవు.  ప్లాంటు ఏర్పాటుకు1500 ఎకరాలకుపైగా భూసేకరణ భారం తప్పనుంది. అంతేగాకుండా వేసవిలో రిజర్వాయర్ నీరు ఎక్కువగా ఆవిరి కాకుండా ప్యానెల్స్ ఆరికడతాయి.

ఒకసారి ప్లాంట్ నిర్మాణానికయ్యే ఖర్చు, ఆ తర్వాత మెయింటనెన్స్ కు తప్ప పెద్దగా ఖర్చు ఉండదు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరిగితే జల, థర్మల్ పవర్ స్టేషన్లలో నీళ్లు, బొగ్గు లాంటి సహజ వనరుల వాడకం కూడా తగ్గుతుంది. మరోవైపు ఇది పర్యావరణ సమతుల్యతకు దోహదం కానుంది.