సీజనల్వ్యాధుల నియంత్రణకు సర్కార్ యాక్షన్ ప్లాన్

సీజనల్వ్యాధుల నియంత్రణకు  సర్కార్ యాక్షన్ ప్లాన్
  • 100 రోజుల ప్రణాళికతో ప్రజల్లో అవగాహన
  • సమస్యలపై రివ్యూలు చేస్తున్న అధికారులు
  • ఉమ్మడి జిల్లాలో 1,214 జీపీలుంటే, 673 మాత్రమే ఫాగింగ్​మిషన్లు
  • మున్సిపాలిటీల్లోనూ అంతంతమాత్రమే..

పెద్దపల్లి, వెలుగు: సీజనల్​ వ్యాధుల నియంత్రణకు సర్కార్​ ప్రణాళికలు రెడీ చేసింది. దీనిలోభాగంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లో దోమల నివారణకు ఫాగింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలని అధికారులను ఆదేశించింది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,214 జీపీలు ఉండగా 673 ఫాగింగ్​ మిషన్లు మాత్రమే ఉన్నాయి. కొన్నేండ్లుగా గ్రామాల్లో, పట్టణాల్లో ఫాగింగ్​ పట్టించుకోకపోవడంతో ఏటా ప్రజలు సీజనల్​ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో సర్కార్​ జూన్​ 2 నుంచి సెప్టెంబర్​ 10 వరకు 100 రోజుల ప్రణాళికను రూపొందించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

ప్రజలకు అవగాహన 

సర్కార్​100 రోజుల ప్రణాళికతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. దోమల నియంత్రణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం.. వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. దోమల వల్ల కలిగే వైరల్​ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకు చాలాగ్రామాల్లో జీపీ సిబ్బంది బ్లీచింగ్​ పౌడర్​చల్లి వదిలేస్తుండగా.. ఇక నుంచి ఫాగింగ్, శానిటేషన్​చర్యలు చేపట్టనున్నారు. 

ఫండ్స్ లేకపోవడమే సమస్య

గ్రామ పంచాయతీల్లో సరిపోయే నిధులు లేకపోవడం వల్లే సీజనల్​ వ్యాధుల నిర్మూలనలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఫాగింగ్​ చేసిన ప్రతీసారి వార్డుల్లో జనాభాను బట్టి రూ. 2 వేల  నుంచి రూ. 3 వేల వరకు అవుతుంది. చాలా జీపీల్లో ఖర్చును భరించలేక ఫాగింగ్​మిషన్లను పక్కన పెట్టారు. దీంతో చాలా మిషన్లు పాడైపోయినట్లు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో 1,214 జీపీలు, 2 మున్సిపల్​కార్పొరేషన్లు, 
13 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

వీటి జనాభాను బట్టి గ్రామాల్లో 1,214కు గానూ 673, మున్సిపాలిటీల్లో ప్రతీ వార్డుకు రెండుకు చొప్పున వందల సంఖ్యలో ఉండాల్సి ఉండగా.. 28 మాత్రమే ఉన్నాయి. వాటిపై కూడా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలావరకు మూలనపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శానిటేషన్‌‌‌‌‌‌‌‌కు బడ్జెట్​ కేటాయిస్తున్నా, వాటిని మరో పనుల కోసం వినియోగించడం వల్లే  నిధుల కొరత తీవ్రమవుతోంది. పాలకమండలి లేకపోవడం, స్పెషల్​ ఆఫీసర్ల పాలనలు ఉండడంతో నిర్ణయాలు తీసుకోవడంతో లేట్​అవుతుంది. దీంతోపాటు నిధుల వినియోగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.