- సీసీఎల్ఏ కమిటీ ఏర్పాటు
- వారం రోజుల్లో క్లియర్చేయాలని టైమ్‌లైన్
- ప్రత్యేక దృష్టిపెట్టిన కలెక్టర్, అడిషనల్కలెక్టర్లు
మెదక్, వెలుగు: భూ సమస్యల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకువచ్చింది. అయితే భూమి విస్తీర్ణం ఎక్కువ తక్కువ నమోదు కావడం. సర్వే నెంబర్లు తప్పుగా పడడం, పట్టా భూమి ఖరీజ్ ఖాతా భూమిగా, ప్రొహిబిటెడ్ నమోదవడం వంటి సమస్యలతో అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలంటూ నిత్యం తహసీల్దార్ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణికి వచ్చే ఆర్జీల్లో ధరణికి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పెండింగ్ అప్లికేషన్ లన్నింటినీ పరిష్కరించాలని నిర్ణయించింది.
ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఎల్ఏ, కమిటీ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ స్థాయిలో ఏఏ సమస్యలు పరిష్కరించవచ్చో నిర్దేశించింది. ఈ మేరకు ఇదివరకటిలా కేవలం కలెక్టర్ స్థాయిలోనే కాకుండా ఆర్డీవో, తహసీల్దార్ స్థాయిలో కూడా ధరణి సైట్ లాగిన్ అయి సమస్యలు పరిష్కరించే వెసులుబాటు కల్పించింది. తహసీల్దార్ లెవల్లో 7 రోజుల్లో, ఆర్డీవో లెవల్లో 3 రోజుల్లో, అడిషనల్ కలెక్టర్ లెవల్ లో 3 రోజుల్లో, కలెక్టర్ లెవల్లో 7 రోజుల్లో పెండింగ్ ధరణి అప్లికేషన్స్ క్లియర్ చేయాలని టైమ్‌లైన్ విధించింది.
కలెక్టర్ ధరణి అప్లికేషన్స్ క్లియరెన్స్‌ను ప్రతి రోజు పర్యవేక్షించాలని ప్రభుత్వం అదేశించింది. ఇందుకు అనుగుణంగా జిల్లాలో ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మండల, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను క్లియర్ చేయడంపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు స్పెషల్ ఫోకస్‌పెట్టి ధరణి పెండింగ్అప్లికేషన్స్ టైమ్ లైన్ ప్రకారం క్లియర్ అయ్యేలా
చూస్తున్నారు.
పరిస్థితి ఇదీ..
వివిధ సమస్యలపై జిల్లాలో ధరణి సమస్యలపై మొత్తం 38,464 దరఖాస్తులు అధికారులకు అందాయి. వాటిలో 20వ తేదీ వరకు 27,627 అప్రూవ్ అయ్యాయి. వివిధ కారణాలతో 289 అప్లికేషన్లు రిజెక్ట్ కాగా, తహసీల్దార్ల వద్ద 1,994 దరఖాస్తులు పెండింగ్ ఉండగా, ఆర్డీవో వద్ద 453, కలెక్టర్ వద్ద 11 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. --------