బాసర వద్ద ఆత్మహత్యల నివారణకు చర్యలు : ఎస్పీ జానకీ షర్మిల

బాసర, వెలుగు: బాసర గోదావరి నది వంతెన వద్ద ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఇటీవల వరుసగా ఆత్మహత్య ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో బాసర గోదావరి నదీ తీరాన్ని బుధవారం ఎస్పీ పరిశీలించారు. వంతెన వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఇకపై నదీ తీరాన ఆత్మహత్య ఘటనలు జరగకుండా కట్టడికి చర్యలు తీసుకుంటామని, బ్రిడ్జికి ఇరువైపుల ఇనుప కంచెతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నదీ పరిసర ప్రాంతాల్లో పోలీసు నిఘాతోపాటు బైక్​పై పెట్రోలింగ్​ నిర్వహిస్తామన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ అవినాశ్ కుమార్, ముథోల్​ సీఐ మల్లేశ్, ఎస్సై గణేశ్ ఉన్నారు.