- రూ. 2 కోట్లు పోగొట్టాడని ఆగ్రహం
- ఆస్తులు అమ్ముతుండడంతో కొట్టి చంపాడు
- మెదక్ జిల్లా భాగిర్తిపల్లిలో ఘటన
చిన్నశంకరంపేట, వెలుగు : మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం భాగిర్తిపల్లిలో జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి బెట్టింగ్‌లు పెట్టి రూ.2 కోట్లు పోగొట్టడంతో ఆగ్రహించిన అతడి తండ్రి చంపేశాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముఖేశ్‌కుమార్(28) రైల్వేలో ఉద్యోగి. ఇతడు కొన్నేండ్లుగా జల్సాలకు అలవాటు పడ్డాడు. అంతేగాక క్రికెట్బెట్టింగులలో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చేందుకు మేడ్చల్‌లోని ఇల్లు, ఓ ప్లాట్అమ్మేశాడు. దీంతో బెట్టింగులు మానుకోవాలని తండ్రి సత్యనారాయణ ఎన్నిసార్లు చెప్పినా ముఖేశ్ వినిపించుకోలేదు.
పైగా తల్లిదండ్రులతో దురుసుగా మాట్లాడేవాడు. ముఖేశ్ తీరు నచ్చక అతడి భార్య సైతం విడిచి వెళ్లిపోయింది. ఈ మధ్య అప్పులు తీర్చేందుకు మరో ఇంటిని కూడా అమ్మేద్దామని నిశ్చయించుకోవడంతో తండ్రీ కొడుకుల మధ్య ఈ విషయమై గొడవ జరిగింది. కొడుకు తీరుతో విసిగిపోయిన సత్యనారాయణ శనివారం అర్ధరాత్రి ఇనుప పైప్ తో ముఖేశ్ తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.