ఈ ఏడాది స్మాల్‌‌, మిడ్‌‌క్యాప్ షేర్ల దూకుడు..25 శాతానికి పైగా లాభపడిన ఇండెక్స్‌‌లు

న్యూఢిల్లీ : చిన్న షేర్లు ఈ ఏడాది అదరగొట్టాయి.  ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మార్కెట్‌‌లో బుల్ ట్రెండ్ కొనసాగింది. రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరగడంతో స్మాల్‌‌, మిడ్‌‌క్యాప్ షేర్లు దూసుకుపోయాయి. ఈ  ఏడాది జనవరి– డిసెంబర్ 23 మధ్య  బీఎస్‌‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 28.45 శాతం (12,144 పాయింట్లు)  పెరగగా, మిడ్‌‌క్యాప్ ఇండెక్స్‌‌ 25.61 శాతం (9,435 పాయింట్లు) లాభపడింది. ఇదే టైమ్‌‌లో బెంచ్‌‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ మాత్రం 8.72 శాతమే(6,300 పాయింట్లే)  పెరిగింది.   బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్ ఇండెక్స్ ఈ ఏడాది డిసెంబర్ 12 న 57,828 లెవెల్ దగ్గర జీవిత కాల గరిష్టాన్ని టచ్‌‌ చేసింది.

మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 24న 49,701 వద్ద జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది.  వినియోగం పెరగడంతో చిన్న కంపెనీల బిజినెస్‌‌లు పుంజుకున్నాయని,  ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌‌ఐ) స్కీమ్‌‌ వీటికి మరింతగా సాయపడిందని ఎనలిస్టులు చెబుతున్నారు.  ఏడాది ప్రారంభంలో స్మాల్‌‌, మిడ్ క్యాప్ షేర్ల వాల్యుయేషన్స్‌‌  తక్కువగా ఉన్నాయి. దీంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు.

సిప్‌‌ రూట్‌‌లో మ్యూచువల్ ఫండ్స్‌‌లోకి  భారీగా పెట్టుబడులు వస్తున్నాయని. ఫండ్స్ కూడా మిడ్‌‌క్యాప్‌‌, స్మాల్‌‌క్యాప్ షేర్లలో తమ పెట్టుబడులు పెంచాయని ఎనలిస్టులు పేర్కొన్నారు.