ఏడుపాయల్లో అసలేం జరుగుతోంది..!

  • ఏడాదిలో ఆరుగురు ఈవోలు చేంజ్ 
  • మూడు నెలల్లో ముగ్గురు బదిలీ

మెదక్/ పాపన్నపేట, వెలుగు: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.. ఎల్లలు దాటి పొరుగు రాష్ట్రాల నుంచి ఏడాది పొడువునా భక్తుల రాక.. ఏటా రూ.8 కోట్లకు పైగా ఆదాయం... ఇన్ని ప్రత్యేకతలు ఉన్న  ఏడుపాయల  వనదుర్గా భవాని మాత ఆలయానికి సమర్థవంతమైన ఈవోని నియమించడంలో ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ నిర్లక్ష్యం చూపుతోంది. కొత్తగా వచ్చిన ఈవోలు కొద్ది రోజుల్లోనే బదిలీ అయి వెళ్లిపోతున్నారు. ఏడాది కాలంలో ఆరుగురు ఈవోలు మారడంతో ఏడుపాయలలో అసలేం జరుగుతోంది? ఈ వోలు ఎందుకు ఇక్కడ పని చేయడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.  

ఈవోపై ఎంతో బాధ్యతఏడుపాయల ఆలయానికి ఏడాది పొడుగునా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో 20 నుంచి 30 వేల మంది అమ్మవారి సేవలో పాల్గొంటారు. ముఖ్యంగా మాఘ అమావాస్య జాతరకు లక్ష మంది వరకు, మూడు రోజులు జరిగే మహా శివరాత్రి జాతరకు ఏడెనిమిది లక్షల మంది వరకు భక్తులు వస్తారు. 

ఏటా వివిధ టెండర్ల నిర్వహణ, ప్రసాదాల తయారీ, మాఘ అమావాస్య, మహా శివరాత్రి జాతర, శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, తరచూ వీఐపీలు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు అమ్మవారి దర్శనానికి వస్తుండడంతో ఆలయ వ్యవహారాల నిర్వహణలో ఈవోపై ఎంతో బాధ్యత ఉంటుంది. 6ఏ జాబితాలో ఉన్న ఈ ఆలయానికి గ్రేడ్-- 1 స్థాయి ఈవో ఉండాలి. కానీ, గత బీఆర్ఎస్ హయాంలో చాలా ఏళ్లుగా గ్రేడ్--2 ఈవో లే పని చేశారు. గ్రేడ్-- 1 స్థాయి అసిస్టెంట్ కమిషనర్ ను ఈవోగా నియమించాల్సి ఉన్నా ఎండోమెంట్ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అప్పటి ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉన్న వారినే ఈవోగా నియమించుకున్నారనే ఆరోపణలు వినిపించాయి.

గతేడాది నుంచి వచ్చినవాళ్లు వచ్చినట్టే..!

గతేడాది అమ్మవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన బంగారు ఆభరణాలు కరిగించి ముద్దగా భద్రపరిచే విషయమై వివాదాస్పదం కావడంతో అప్పటి ఈవోపై బదిలీ చేశారు. ఆ తరువాత ఏడుపాయల ఆలయానికి ఈవో లుగా నియమితులు అవుతున్న వారు కొన్నాళ్లకే బదిలీ అవుతున్నారు. అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు  ఏడుపాయల ఈవోలుగా నియామకం అయినా.. ఇక్కడ బాధ్యతలు తీసుకున్న నెల, రెండు నెలల లోపే బదిలీలు అవుతున్నారు. సారా శ్రీనివాస తర్వాత ఈవోగా నియామకం అయిన రవికుమార్ ఛార్జి తీసుకున్న కొద్దిరోజుల్లోనే బదిలీ అయ్యారు. 

ఆ తర్వాత మోహన్ రెడ్డి 22 సెప్టెంబర్ 2023 న ఏడుపాయల ఈవోగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన 31 మే 2024 రోజున రిటైర్మెంట్ అయ్యారు. ఆ తర్వాత జూన్ 10వ తేదీన  దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న వినోద్ రెడ్డి ఏడుపాయల ఈవోగా బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా నెల రోజులు పని చేసిన ఆయన వేములవాడ ఆలయానికి బదిలీ అయ్యారు. ఆ తర్వాత 3 జులై 2024 రోజు డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా  నెల రోజులకే  బదిలీ అయ్యారు. తాజాగా  20 ఆగస్టు 2024న దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించగా, ఈయన కూడా ఎన్ని రోజులు విధులు నిర్వహిస్తారో చూడాలి. 

ఇవీ కారణాలు..!

ఏడుపాయలలో ఈవోతో పాటు మొత్తం ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఇద్దరు అటెండర్లు, 26 మంది స్వీపర్లు,  మరో 14 మంది టెంపరరీ ఉద్యోగులు ఉంటారు. లడ్డు తయారీలో మరో 15 మంది ఉంటారు. వీరిలో పలువురు ఉద్యోగులు 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్నారు. ఇక్కడే పాతుకుపోయిన ఆయా ఉద్యోగులకు ఆలయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ తెలుసు. కొత్తగా వచ్చే ఈవోలు ఎవరైనా ఆయా పనుల కోసం సిబ్బందిపై ఆధార పడక తప్పని పరిస్థితి. దీనిని ఆసరా చేసుకొని సదరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. 

స్థానికులైన కొందరు ఉద్యోగులు డ్యూటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో పాటు ఈవో లకు సహకరించక పోవడంతో వారిక్కడ విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇది వరకు జరిగిన ఆలయ బంగారం వ్యవహారం, హుండీల దొంగతనం వంటి సంఘట నల కారణంగా కొందరు ఈవో లు ఇక్కడ డ్యూటీ చేసేందుకు ఇష్టపడక వెళ్లిపోతున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా ఉన్నందున ప్రత్యేక దృష్టి పెట్టి ఏడుపాయల ఆలయానికి సమర్థుడైన అధికారిని ఈవోగా నియమించాలని భక్తులు కోరుతున్నారు.