ప్రమాదకరంగా సింగరేణి 33 కేవీ విద్యుత్ లైన్

సింగరేణి సంస్థ బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ కాలనీ మీదుగా ఉన్న సింగరేణి 33 కేవీ విద్యుత్ లైన్​ప్రమాదకరంగా మారింది. తీగలు కిందకు ఉండడంతో ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకునే వారు ప్రమాదాలకు గురవుతున్నారు. గతేడాది ఓ ఇల్లు నిర్మాణంలో ఉండగా కరెంట్​షాక్​కు గురై బాలిక వైకల్యానికి గురైంది. కొద్దిరోజుల క్రితం ఈ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇల్లు నిర్మిస్తుండగా కూలి పనికి వచ్చిన వ్యక్తికి  షాక్​ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

సమస్య పరిష్కరించాలని మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల సింగరేణి జీఎంలకు విన్నవించినా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని, లేదంటే ఉద్యమం చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

బెల్లంపల్లి, వెలుగు