ఏ కష్టమొచ్చినా.. టోంకినీ అంజన్న స్మరణే భక్తులకు అభయహస్తం. పురాతన కాలంలో వార్ధా నదిలో విగ్రహంగా బయటపడి, భక్తులతో నిత్య పూజలు అందుకుంటూ కోర్కెలు తీర్చే కల్పతరువుగా మారాడు అంజన్న...
హనుమాన్ ఆలయం ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్–టీ మండలం టోంకినీలో ఉంది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. దీనికి సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. రామాయణ కాలంలో రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లినప్పుడు, హనుమంతుడు ఆమె జాడ కోసం వెతుకుతుంటాడు. అలా వెతికి.. వెతికి అలసిపోయి వార్ధా నది ఒడ్డున కాసేపు సేద తీరారని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడే అటువైపు వచ్చిన కొండజాతి ప్రజలు హనుమంతుడికి పండ్లు ఇచ్చారు. కానీ.. వాటిని తినకుండా ‘రాములవారికి సీతమ్మ జాడ చెప్పేదాకా గాలి తప్ప ఇంకేమీ తీసుకోను. కానీ.. నాపై ప్రేమతో పండ్లు ఇచ్చినందుకు నేను ఇక్కడ వెలిసి మీ కష్టాలు తీరుస్తాను’ అని వాళ్లతో చెప్పాడట. ఆ తర్వాత అక్కడే విగ్రహంగా వెలిశాడు. ఈ విషయాన్ని సిర్పూర్ ఏరియాలోని లోనవెల్లి గ్రామానికి చెందిన జెఠ్మల్ సోనీ అనే భక్తుడి కలలో వచ్చి చెప్పాడు హనుమంతుడు. దాంతో అయన టోంకినీ గ్రామస్తులు కొందరిని వెంట తీసుకెళ్లి వార్ధా నదిలో వెతకగా హనుమంతుడి విగ్రహం దొరికింది. దాన్ని తీసుకొచ్చి ఒక గుడిసె వేసి అందులో ప్రతిష్ఠించారు. అని భక్తులు చెప్తుంటారు. అయితే ఈ విగ్రహం పరిమాణం ఏటేటా పెరుగుతుండడం విశేషం.
అన్నీ ప్రత్యేకతలే
టోంకినీ సిద్ధి హనుమాన్ ఆలయం అన్నిట్లో ప్రత్యేకమే. ఆలయానికి సుమారు ఏడు కిలో మీటర్ల దూరంలో వార్ధా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది. ఆలయం ముఖ ద్వారం పడమర వైపు ఉంది. కానీ.. విగ్రహం మాత్రం దక్షిణాభి ముఖంగా ఉంది. అంతేకాదు అంజన్నకు ముడుపు కడితే కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే ముడుపుల హనుమాన్‌గా కూడా పిలుస్తుంటారు. మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ ఆలయం కట్టక ముందు వర్షాకాలం వస్తే చాలు వరదలతో టోంకినీ గ్రామం మునిగిపోయేది. ఈ ఆలయం కట్టిననాటి నుంచి ఎంత వర్షం వచ్చినా ఊరు మునిగిపోవడం లేదు. ఎంత వరద వచ్చినా నీళ్లు ఆలయం మెట్ల దాకా వచ్చి ఆగిపోతున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు.
అలా మొదలైంది
టోంకినీ పాదయాత్రకు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ప్రతీ ఏటా దీపావళి తర్వాత రెండో మంగళవారం ఇక్కడ మహా పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం 2001లో మొదలైంది. మొదటిసారి ఓం ప్రకాష్ తివారీ అనే భక్తుడు ఆలయ కమిటీతో కలిసి 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఇప్పుడు పాదయాత్రకు 35 నుంచి 40 వేల మంది వస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఈ పాదయాత్రలో పాల్గొంటారు. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి, మాలధారణ, రామనవమి వేడుకలు వైభవంగా చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.